కృష్ణా జిల్లా: మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా యూనివర్శిటీలో శనివారం అర్ధరాత్రి ఈవీఎంల తరలింపులో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై ఓ న్యూస్ చానల్లో ప్రచారం కావటంతో పాటు, ఓ దినపత్రికలో కూడా వార్త ప్రచురితమైంది. దీనిపై రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడు నియోజకవర్గానికి చెందిన పోలింగ్ ప్రక్రియకు ఉపయోగించిన ఈవీఎంలతో పాటు, రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అనంతరం రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను మచిలీపట్నంలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదాముకు తరలించారు. ఈ సంఘటనపై న్యూస్ చానల్, దినపత్రికలో స్ట్రాంగ్ రూంలను తెరిచి ఈవీఎంలను తరలించినట్లు ప్రచురితమైంది. దీనిపై ఆదివారం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌తో పాటు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జిల్లా అధికారులు స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీల్లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
అనంతరం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను మాత్రమే స్ట్రాంగ్ రూంకు తరలించటం జరిగిందన్నారు. అది కూడా నూజివీడు నియోజకవర్గ రాజకీయ పార్టీ నాయకుల సమ్మతితోనే తరలించటం జరిగిందన్నారు. అయితే ఓ న్యూస్ చానల్‌లో ప్రసారం అయిన వీడియోను ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంట ఉన్న వీడియో గ్రాఫర్ ద్వారా లీకైనట్లుగా భావిస్తున్నామన్నారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణతో పాటు, సీసీ కెమోరాల పుటేజీలను కూడా సేకరించి సంబంధిత వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఆ దృశ్యాలను సదరు మీడియా ఛానల్లో ప్రసారం కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment