
ప్రజా సంకల్పయాత్ర బృందం: రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రైవేట్ ఉపాధ్యాయ, అధ్యాపకుల వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ దుర్గాప్రసాద్, తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి నియోజకవర్గంలో గల బాడంగి మండలం ముగడ వద్ద ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోజుకు 10 నుంచి 12 గంటల పాటు నిల్చునే పాఠాలు చెబుతున్నామన్నారు.
మా ఒరిజినల్ సర్టిఫికెట్లు యాజమాన్యాలు తమవద్దే ఉంచుకుని మానసికంగా వేధిస్తున్నాయని జననేత దృష్టికి తీసుకువచ్చారు. ఖాళీ చెక్కుల మీద సంతకాలు.. ప్రాంశరీ నోట్లు రాయించుకుని ఒక్కరోజు సెలవు పెడితే రెండు రోజుల వేతనాన్ని తగ్గించేస్తున్నారని వాపోయారు. విద్యార్థుల ప్రవేశాల పేరుతో వేసవిలో రోడ్లమీద తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులకు మెటర్నటీ సెలవులు కూడా ఇవ్వడం లేదని... ఆదివారం, రెండో శనివారం వంటి జాతీయ సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
మార్కెట్‌యార్డుకు పేదల భూములు..
పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూములను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ యార్డుకు కేటాయించి పేదలకు అన్యాయం చేశారని రామభద్రాపురం మండలం వైఎస్సార్‌సీపీ నాయకుడు డబ్ల్యూవీఎల్‌ఎన్ రాయులు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బాడంగి మండలం డొంకినవలస వద్ద ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రామభద్రాపురం నుంచి బాడంగి వెళ్లే ప్రధాన మార్గంలో 17 ఎకరాల భూమిని పేదల కోసం కేటాయించారన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు అందులో పది ఎకరాలను మార్కెట్‌యార్డుకు కేటాయించారని తెలిపారు. మిగిలిన ప్రాంతలంలో రూ. కోటితో రైతుబజార్ ఏర్పాటు కోసం షెడ్డులు నిర్మించడానికి ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. పేదల భూములు వారికే చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మా హక్కులను కోల్పోతున్నాం..
తెలంగాణలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తాము స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కోల్పోయి కష్టాలు పడాల్సి వస్తోందని నాన్‌లోకల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. మోహన్‌రావుతో పాటు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 1997 నుంచి పనిచేస్తున్నా తమకు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అవకాశం లేకపోయిందని వాపోయారు. తెలంగాణలో కేవలం 426 మంది ఆంధ్రాకు చెందిన ఉపాధ్యాయులుండగా, ఈ ప్రభుత్వం తమను సొంత రాష్ట్రానికి తీసుకురాలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలు, మంత్రులకు 2014 నుంచి పలుమార్లు దరఖాస్తులు ఇస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉపాధ్యాయులు సుమారు 200 మందిని తెలంగాణా ప్రభుత్వం తీసుకుపోయినా... మమ్మలను మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడే విడిచిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ బీసీ కులస్తులుగా ఉన్న 26 కులాలను తెలంగాణాలో ఓసీలుగా మార్చడంతో రిజర్వేషన్ పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. ముసలివారైన తల్లిదండ్రులు ఆంధ్రాలో ఉంటే మేము తెలంగాణాలో ఉండాల్సి వస్తోందని వాపోయారు. దీనికి జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment