మంత్రి తానేటి వనితకు వినతిపత్రం అందిస్తున్న ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల యూనియన్ నాయకులు
ఏలూరు (మెట్రో): ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినా.. సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తమకు న్యాయం చేయాలని ప్రైవేటు టీచర్లు, లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దిద్దే అంబేడ్కర్ కోరారు. కలెక్టరేట్‌లో మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు, తానేటి వనితలను కలిసి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ మాట్లాడుతూ రవీంద్రభారతి వంటి యాజమాన్యాలు జనవరి నెల నుంచి కూడా సిబ్బందికి జీతాలు ఇవ్వలేదన్నారు. మిగతా యాజమాన్యాలు మార్చి, ఏప్రిల్, మే నెలల జీతాలు ఇవ్వకుండా సిబ్బందిని వేధిస్తున్నారని, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు సిబ్బందికి సగం జీతం మాత్రమే ఇస్తున్నారన్నారు.
అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సిబ్బందిని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని.. ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ సమాజానికి సేవ చేస్తున్న సుమారు 5 లక్షల ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. విద్యాసంస్థలు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితులవల్ల సిబ్బందికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మంత్రులను కోరారు. దీనిపై మంత్రి రంగనాథరాజు స్పందిస్తూ.. యాజమాన్యాలు ఈ సమయంలో సిబ్బందిని ఆదుకోవాలన్నారు. తమ విద్యా సంస్థల్లో సిబ్బందికి మే జీతాలు ఇచ్చామని.. మిగతా యాజమాన్యాలు కూడా స్పందించాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. తానేటి వనిత మాట్లాడుతూ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుగ్గిరాల కృష్ణారావు, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు జయ ప్రకాష్ , పట్టణ జనరల్ సెక్రటరీ దాసు, ఇతర ప్రైవేటు టీచర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment