
సీఎం పర్యటన నిమిత్తం ద్వారకాతిరుమల పోలీస్టేషన్ వద్దకు చేరిన స్కూల్ బస్సులు
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ద్వారకాతిరుమల : ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జిల్లా పర్యటనకు రానుండడంతో అధికారులు జనసమీకరణకు పూనుకున్నారు. చింతలపూడిలో సీఎం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ సభకు జనాన్ని తరలించేందుకు అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సులను సమీకరిస్తున్నారు. అందుకోసం ఏకంగా ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలోని ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి అధికారికంగా ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం స్కూళ్లకు సెలవు ఇవ్వడంపై విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేయడమే కాకుండా మండిపడుతున్నారు.
గ్రామదర్శినికి సుమారు 150 బస్సులు
చింతలపూడిలో నిర్వహించనున్న గ్రామ దర్శిని కార్యక్రమానికి జనాన్ని తరలించడానికి సుమారు 150 బస్సులు కావాలని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో రవాణా శాఖ అధికారులు ఏలూరు డివిజన్ పరిధిలోని ఏలూరు, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నరసాపురం, కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల తదితర ప్రాంతాలతో పాటు జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లోని ప్రైవేట్ స్కూళ్లకు చెందిన బస్సులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జనాన్ని తరలించే బాధ్యతను అధికారులకు డ్వాక్రా మహిళలకు అప్పగించారు. వచ్చిన వారికి స్నాక్స్ వంటి వాటికి అయ్యే ఖర్చులను కూడా గ్రామ సంఘాలే భరించాలని ఆదేశించారు. దీంతో డ్వాక్రా మహిళలు ఇదెక్కడి గోలరా బాబు.. అంటూ తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment