గమ్యస్థానాలు చేరుకొనేందుకు ప్రయాణికుల అవస్థలు
ప్రైవేట్ ట్రావెల్స్ దసరా పండగ చేసుకుంటున్నాయి. పండగ రద్దీ పేరిట అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే భారీ జరిమానా విధిస్తామన్న రవాణ శాఖ హెచ్చరికలు బేఖాతరు అవుతున్నాయి. టికెట్ ధరకు రెండింతలకు పైగా పెంచేసి ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ నిలువుదోపిడీ చేస్తున్నాయి. పెరిగిన ధరలతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. 50 శాతం అదనపు చార్జీపై హైదరాబాద్, రాష్ట్రంలోని ముఖ్య నగరాలకు 325 సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. పెంచిన ధరలతో దసరా పండగ కోసం జిల్లాకు వచ్చేవారిపై దాదాపు రూ.2.34 కోట్ల అదనపు భారం పడుతున్నట్టు అంచనా.
తూర్పుగోదావరి, మండపేట: విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి కోసం హైదరాబాద్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి.. దసరా పండగ కోసం జిల్లాలోని స్వస్థలాలకు వచ్చినందుకు టికెట్ల రూపంగా పెనుభారం మోసే దుస్థితి ఏర్పడుతోంది. దసరా సెలవుల ప్రారంభం నుంచి జిల్లాకు వచ్చే బస్సులు, రైళ్లల్లో రద్దీ మొదలైంది. వచ్చే ఆదివారం వరకు పాఠశాలలకు సెలవులు ఉండటంతో తిరుగు ప్రయాణికులతో మరో ఐదు రోజులు పాటు రద్దీ కొనసాగుతుంది. గమ్యస్థానాలకు చేరే వీరి నుంచి టికెట్ల రూపంలో దోపిడీ చేసేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ పొంచి ఉన్నాయి. సాధారణ టికెట్టు ధరను రెండు రెట్లు పెంచేసి దోపిడీ పర్వానికి తెరలేపాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో ఆదివారం సర్వీసులు రద్దు కావడం ప్రైవేట్ ట్రావెల్స్‌కు మరింత కలిసొచ్చింది. హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే బస్సులకు ధరలు అమాంతం పెంచేశారు. మరో దారి లేక అధిక ధరలు చెల్లించి ప్రైవేట్ ట్రావెల్స్‌ను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు.
భారీగా ధరల పెంపు
కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, తుని, రాజోలు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రోజుకు దాదాపు 130 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 40 శాతానికి పైగా ఏసీ సర్వీసులే. ఈ బస్సుల సిటింగ్ సామర్థాన్ని బట్టి 5,100 మంది వరకు ప్రయాణించే వీలు ఉంది. సాధారణ రోజుల్లో కాకినాడ నుంచి హైదరాబాద్‌కు టికెట్ రూ.500 నుంచి రూ.650 వరకు ఉంటుంది. ఏసీ సర్వీసుకు రూ.750 ఉంటుంది. పండగల రద్దీ పేరుతో ఆదివారం పలు ట్రావెల్స్ సాధారణ సర్వీసులకు టికెట్ రూ.1,200 నుంచి రూ.1,600 వరకు, ఏసీ సర్వీసుకు రూ.2,300 వరకు పెంచేశారు. సగటున ఒక్క టికెట్‌పై రూ.800 వరకు అదనపు భారం ప్రయాణికులపై పడుతున్నట్టు అంచనా. ఈ నెల 13వ తేదీ వరకు తిరుగు ప్రయాణ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ఈ ఐదు రోజుల వ్యవధిలో దాదాపు రూ.2.34 కోట్ల మేర అదనపు భారం జిల్లావాసులపై పడుతుందని అంచనా. గతంలో పండగల రద్దీ సమయంలో నిబంధనలకు తుంగలోకి తొక్కి పర్మిట్లు లేకుండానే కొందరు వ్యాపారులు యథేచ్ఛగా ప్రైవేట్ బస్సులు నడిపేవారు. అధిక ధరలు వసూలు చేస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్న రవాణా శాఖ.. నామమాత్రపు తనిఖీలతో చేతులు దులుపుకుంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఇప్పుడైనా తనిఖీలు విస్తృతంగా చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
జిల్లా నుంచి హైదరాబాద్‌కు రోజుకు 40 వరకు సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ దసరా రద్దీ కారణంగా టికెట్ ధరపై 50 శాతం అదనంగా ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. గతేడాది హైదరాబాద్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు జిల్లా నుంచి రానుపోనూ 293 సర్వీసులు ఆర్టీసీ నడిపింది. ఈ ఏడాది 325 సర్వీసుల వరకు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ప్రత్యేక సర్వీసుల ద్వారా దాదాపు రూ.30 లక్షల వరకు అదనపు ఆదాయం వస్తుందని ఆర్టీసీ అంచనా. మరోపక్క హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణికులతో ఈ నెల 13వ తేదీ వరకు రైళ్లలో వెయింటింగ్ లిస్ట్ అధికంగా ఉంది. జిల్లా మీదుగా రోజూ హైదరాబాద్‌కు 12 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment