- హెల్త్ సెంటర్లలో అందుబాటులో లేని వైనం
లబ్బీపేట : పెనమలూరులో పది రోజుల కిందట వీధికుక్కలు దాడి చేయగా నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. వాస్తవానికి పెనమలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నప్పటికీ యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్‌వీ) కోసం వారిని ఉరుకులు పరుగులతో నగరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకురావాల్సి వచ్చింది.
రాజీవ్‌నగర్‌లో నివశించే ఏడేళ్ల బాలికను నెల రోజుల కిందట కుక్క కరిచింది. తీవ్రంగా గాయపడిన బాలికను తల్లిదండ్రులు సమీపంలోని సామాజికి ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉండదని సిబ్బంది చెప్పడంతో గుణదలలో ఉన్న కొత్త ప్రభుత్వాస్పత్రికి తీసుకురావాల్సి వచ్చింది. ఇలా పెనమలూరు, రాజీవ్‌నగర్ మాత్రమే కాదు నగరంలోనూ, చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడ కుక్క కరిచినా రేబిస్ వ్యాక్సిన్ కోసం హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి రావాల్సి వస్తోంది. వీధి కుక్కలను నియంత్రించలేని ప్రభుత్వం, కనీసం కుక్క కరిస్తే వేసేందుకు వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంచలేకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నగర జనాభా 12 లక్షలు దాటినా.. అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రాథమిక వైద్యం కూడా అందుబాటులోకి రాకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఏ చిన్న వ్యాధి సోకినా ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది. ప్రస్తుతం నగరంలో కుక్కల బెడద ఎక్కువుగా ఉండటంతో నిత్యం ఏదోఒక ప్రాంతంలో ప్రజలు వాటి బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వాస్పత్రికి నిత్యం 60 నుంచి 80 మంది వరకూ కుక్కకాటు బాధితులు వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. నగరంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాలు,అర్బన్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లలో యాంటి రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడమే అందుకు కారణంగా చెపుతున్నారు.
కుక్కకాటుకు గురైన వెంటనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా, అందుకోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చే సరికి ఆలస్యం అవుతోందని పలువురు ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఎక్కువగా ఉన్న కుక్కలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తే జీవకారుణ్య సంస్థలు వంటివి అడ్డుకోవడం తెలిసిందే. దీంతో కుక్కలు ఎక్కువ అవడంతో, వాటి బారిన పడేవారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. వృద్ధుల నుంచి చిన్నారుల వరకూ వీటి బారిన పడుతున్నారు. చిన్న గాయాలైతే ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్‌వీ వ్యాక్సిన్ వేస్తున్నారు. ముఖంపై పెద్ద గాయాలైతే ఇమ్యునోగ్లోబలిన్ అనే ఇంజక్షన్‌ను కూడా ఉచితంగా వేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి కుక్కకాటు వ్యాక్సిన్‌ను అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
ఏఆర్‌వీ కోసం ఇబ్బందులు
Published Mon, May 11 2015 4:41 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement