నక్సల్స్ సంబంధాలపై ప్రొఫెసర్ అరెస్టు
ఏపీకి చెందిన సాయిబాబాను అదుపులోకి తీసుకున్న మహారాష్ర్ట పోలీసులు
మావోయిస్టు పార్టీతో సంబంధాలపై ఆధారాలున్నాయన్న అధికారులు
హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీ సులు అరెస్టు చేశారు. గత ఆరు నెలల్లో అనేకమార్లు ప్రశ్నించిన మీదట ఆయ న్ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయిబాబాను అరెస్టు చేశామని, ఢిల్లీ కోర్టు అనుమతితో అతడిని గడ్చిరోలికి తీసుకువస్తామని మహారాష్ట్ర డీఐజీ రవీంద్ర కదమ్ చెప్పారు. నిషేధిత తీవ్రవాద సంస్థ సీపీఐ-మావోయిస్టు సభ్యుడిగా వారికి అనేక రకాలుగా సాయిబాబా సహాయపడుతున్నారని ఆరోపించారు. మావోయిస్టుపార్టీలో కొత్త వారిని చేర్పించడంలో కూడా ప్రొఫెసర్ హస్తముందన్నారు. సాయిబాబా అరెస్ట్‌ను ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. ఇదివరకే ఆయన కంప్యూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు. అందులోని కొన్ని ఫైల్స్ మావోయిస్టులతో అతని సంబంధాలను ధ్రువపరుస్తున్నాయని డీఐజీ చెప్పారు. మావోల కోసం పని చేస్తున్న ఓ సంస్థను సాయిబాబా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి హేమంత్ మిశ్రా అరెస్టు అనంతరం సాయిబాబా పేరు వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడవుల్లో ఉన్న మావోయిస్టులకు, ప్రొఫెసర్‌కు మధ్య తాను కొరి యర్‌గా వ్యవహరిస్తున్నట్లు హేమంత్ అంగీకరించినట్లు పోలీసువర్గాలు తెలిపాయి. మావో నేతలు కోబాడ్‌గాంధీ, బచ్చా ప్రసాద్ సింగ్, ప్రశాంత్ రాహీలు కూడా సాయిబాబా పేరును వెల్లడించినట్లు చెప్పారు. ఈ ఆరోపణలను సాయిబాబా ఖండించారు.
నల్లమిల్లి నుంచి ఢిల్లీకి...
అమలాపురం టౌన్, ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా అరెస్ట్‌తో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కలకలం రేగింది. సాయిబాబా సొంతూరు అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న నల్లమిల్లి గ్రామం. సామాన్య కుటుంబానికి చెందిన సాయిబాబా వికలాంగుడు. చిన్నతనం నుంచి సౌమ్యునిగా, చదువులో చురుగ్గా ఉండేవాడని గ్రామస్థులు చెప్పారు. అతని తండ్రి సత్యనారాయణ ఎంతో కష్టపడి సాయిబాబాను చదివించారన్నారు. సైకిల్‌పై అమలాపురంలోని ఎస్‌కేబీఆర్ కళాశాలకు తీసుకెళ్లి సాయిబాబా ఉన్నత చదువులు పూర్తి చేయించారన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన సాయిబాబా అక్కడే డిగ్రీ పూర్తి చేసి, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేశారు. సీఫెల్ నుంచి డాక్టరేట్ పొందారు. ఆ సమయంలోనే ప్రేమించిన యువతిని కులాంతర వివాహం చేసుకున్నారు.
ఇంట్లోకి చొరబడి ఎత్తుకెళ్లారు: సాయిబాబా భార్య వసంత
న్యూఢిల్లీ: పోలీసులు ఇంట్లోకి చొరబడి తన భర్తను ఎత్తుకెళ్లారని సాయిబాబా భార్య వసంత ఆరోపించారు. అబూజ్‌మడ్‌లో పోలీసులు చేపట్టిన గ్రీన్ హంట్‌కి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నందునే అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన రెవల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఆర్‌డీఎఫ్) సంయుక్త కార్యదర్శి ప్రొఫెసర్ సాయిబాబాను బేషరతుగా విడుదల చేయాలని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు వరవరరావు, కార్యదర్శి రాజ్‌కిషోర్, విరసం కార్యద ర్శి వరలక్ష్మి డిమాండ్ చేశారు.