సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై ఏయూ మెట్రాలజీ మాజీ విభాగాదిపతి, వాతావరణ నిపుణులు ప్రొఫెసర్ భానుకుమార్ గురువారం మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు అనువైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గత వంద సంవత్సరాల వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే హుద్ హుద్ తప్పితే.. విశాఖను నేరుగా తాకిన తుఫాన్‌లు లేవని ఆయన వెల్లడించారు. విశాఖ కంటే అమరావతిపైనే తుఫాన్‌ల ప్రభావం ఎక్కువని భానుకుమార్ పేర్కొన్నారు. ఒకేసారి అసాధారణంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం పడినా కూడా సముద్రతీర ప్రాంతం వల్ల విశాఖకు మేలు జరుగుతుందని అన్నారు. అన్ని కాలాల్లోనూ విశాఖలో అనువైన వాతావరణం ఉంటుందని భానుకుమార్ అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయం అభినందనీయమని ఆయన అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటనను తాను స్వాగతిస్తున్నానని భానుకుమార్ పేర్కొన్నారు.
అదేవిధంగా ఎకనామిస్ట్, ఏయూ మాజీ ఆర్థిక విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీరామమూర్తి మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో చాలా తక్కువ ఖర్చుతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉందని ఆయన తెలిపారు. ముంబైని మించి విశాఖ నగరం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని శ్రీరామమూర్తి పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ అని చెప్పారు. ప్రాంతీయ అసమానతలను తొలగించే విధంగా సీఎం వైఎస్ జగన్ ప్రకటన ఉందన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అయన అభిప్రాయపడ్డారు. అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందితే రాష్ట్రంలో జీడీపీ రేటు అభివృద్ధి చెంది హ్యాపీ ఇండెక్స్ ర్యాంకు కూడా పెరుగుతుందని శ్రీరామమూర్తి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో చాలా దేశాల్లో రెండు, మూడు రాజధానులు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఒక ఆర్థికవేత్తగా సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన హర్షణీయమని శ్రీరామమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment