ఫిరోజ్ కుటుంబానికి మొండి చేయి!
సాక్షి, హైదరాబాద్: దేశం కోసం పోరాడుతూ పాకిస్థాన్ సరిహద్దుల్లో గత నెల 15న ప్రా ణాలర్పించిన అమరవీరుడు లాన్స్ నాయక్ మహ్మద్ ఫిరోజ్‌ఖాన్ కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటికీ ఎక్స్‌గ్రేషియా ఇవ్వనే లేదు. 6 నెలల క్రితం పాకిస్థాన్ సరిహద్దుల్లో అమరుడైన మహబూబ్‌నగర్ జిల్లా వాసి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం ఇచ్చింది. అమరవీరుడు ఫిరోజ్ కుటుంబానికి మాత్రం ప్రభుత్వం రూ.లక్ష పంపింది. అయితే, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం ఇస్తామని రాష్ట్ర మంత్రి డీ కే అరుణ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ రూ. లక్షను తిరస్కరించామని ఫిరోజ్ తల్లి అక్తర్ బేగం ‘సాక్షి’తో చెప్పారు.
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరామని ఫిరోజ్ మామ మొయినుద్దీన్ తెలిపారు. తన కొడుకు దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించాడని, అతనికి ఇస్తున్న గౌరవం ఇదేనా అని అక్తర్ బేగం ప్రశ్నించారు. కాగా, ఈ విషయమై జిల్లా సైనిక సంక్షేమ అధికారి ప్రవీణ్ కూమార్‌ను సంప్రదించగా.. మానిటరింగ్ ఫండ్ రూపంలో గత వారం జిల్లా కలెక్టర్ రూ.లక్షను జిల్లా సైనిక బోర్డుకు అందజేశారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వాసి కుటుంబానికి ఇచ్చినట్లే ఫిరోజ్ కుటుంబానికీ సాయం అందించాలని జిల్లాకలెక్టర్‌కు నివేదించామని, ఈ వినతిని జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శికి పంపారన్నారు.