చంపేయమని పాక్ సైనికులకు చెప్పాను
న్యూఢిల్లీ: తనను చంపేయమని పాకిస్థాన్ సైనికులకు చెప్పానని ఆ దేశంలో బందీగా ఉండి, ఇటీవల విడుదలైన భారత సైనికుడు చందూ బాబూలాల్ చవాన్ చెప్పారు. తనను చిత్రహింసలకు గురిచేశారని, తన జీవితం అక్కడే ముగిసి పోతుందని భావించానని, తనను చంపేయాల్సిందిగా పాక్ సైనికులకు చెప్పానని చవాన్ తెలిపారు. వేధింపులు భరించలేక తనకు చావు ప్రసాదించమని దేవుణ్ని ప్రార్థించేవాడినని చెప్పారు.
జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చవాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఉరిలోని భారత సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత, గతేడాది సెప్టెంబర్ 29న భారత సైనికులు నియంత్రణ రేఖ అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు. అదే రోజున 22 ఏళ్ల చవాన్ నియంత్రణ రేఖ దాటి పాక్ భూభాగంలోకి వెళ్లారు. పాకిస్థాన్ సైనికులు ఆయన్ను పట్టుకుని బందించారు. నాలుగు నెలల తర్వాత జనవరి 21న పాక్ సైనికులు.. చవాన్‌ను భారత్‌కు అప్పగించారు.
పాక్ సైనికుల కస్టడీలో అనుభవించిన కష్టాలను చవాన్.. ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'నేను పాక్ సైనికులకు చిక్కిన తర్వాత వారు నన్ను తనికీ చేశారు. నా దుస్తులు తీసుకున్నారు. నాపై నల్లటి దుస్తులు వేసి, ఓ వాహనంలో తీసుకెళ్లారు. ఓ చీకటి గదిలో నన్ను బంధించారు. బాత్‌రూమ్, టాయ్‌లెట్ కూడా అదే గదిలో ఉన్నాయి. నాకు ఇంజెక్షన్లు వేసి, కొట్టేవారు. చెవిలో డ్రాప్స్ వేయడంతో రక్తం వచ్చేది. ఏం చేయాలో అర్థంకాలేదు. తల బాదుకునేవాణ్ని. నన్ను చంపేయమని వారికి చెప్పాను. రాత్రా పగలా అన్న విషయం కూడా తెలిసేది కాదు. ఆ సమయంలో నా కుటుంబం గుర్తుకు వచ్చి దుఃఖం వచ్చేది. నాకు చావు ప్రసాదించమని దేవుణ్ని కోరుకునేవాణ్ని' అని చెప్పారు.