యూరి 'ఉగ్ర'దాడి.. సైనికుడి వైరల్ వీడియో!
18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడి యావత్ భారతాన్ని దిగ్భ్రాంత పరిచింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ముగ్గురు ఆత్మాహుతి దళ ఉగ్రవాదులు తలపెట్టిన ఈ నరమేధంలో మరో 18మంది జవాన్లు గాయపడ్డారు. ఈ అమానుష హింసాత్మక ఘాతుకంపై భారత్ తోపాటు యావత్ ప్రపంచం ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఓ భారతీయ సైనికుడు భావోద్వేగంగా ఆలపించిన దేశభక్తి గీతం వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను కుదిపేస్తున్నది.
'కశ్మీర్ ఉంటుంది కానీ, పాకిస్థానే ఉండదు' (కశ్మీర్ తో హోగా, లేకిన్ పాకిస్తాన్ నహి హోగా' అంటూ వీరోచితంగా కవితాగానం చేస్తూ.. తనతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న సాటి సైనికులను ఉత్సాహపరుస్తున్న ఈ వీడియో చూపరుల రోమాలను నిక్కబొడిచేలా చేస్తోంది. దేశభక్తి నరనరాన జీర్ణించుకున్న సైనికుల మొక్కవోనీ త్యాగాలను కీర్తిస్తూ సాగిన ఈ కవితను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) యువ వక్త అయిన సాధ్వీ బాలికా సరస్వతి రచించారు.
'సింహాల పిల్లలు తోడేళ్లకు భయపడవు. భారతదేశ పరంపర వల్లే కానీ పాకిస్థాన్ కు సొంతంగా గుర్తింపు లేదు' అంటూ వీరోచితంగా సాగిన ఈ వీడియోను ఇప్పుడు వేలమంది తిలకిస్తున్నారు. 'పాకిస్థాన్ శ్రద్ధగా విను. యుద్ధమంటూ వచ్చిందంటే నీ నామరూపాలు ఉండవు. కశ్మీర్ ఉంటుందని కానీ పాకిస్థానే ఉండదు' అంటూ సాగిన ఈ వీడియోను ఎప్పుడు రికార్డు చేశారో తెలియదు కానీ, యూరి ఉగ్రవాద దాడి అనంతరం భారత సైనికులు రగిలిపోతున్న నేపథ్యంలో ఆన్ లైన్ లో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది.