యురి ఉగ్రదాడి: పాక్ ఆర్మీకి ఫోన్కాల్
శ్రీనగర్: కశ్మీర్ లోయలోని బారాముల్లా జిల్లా సరిహద్దు సమీపంలోని యురి సైనిక స్థావరంపై ఆదివారం జరిగిన ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్ ఆర్మీ అధికారులతో మాట్లాడినట్లు మిలటరీ ఆపరేషన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ రణ్ వీర్ సింగ్ చెప్పారు. ఆదివారం సాయంత్రం కశ్మీర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన యురి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు.
దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టి వారి నుంచి నాలుగు ఏకే 47 రైఫిళ్లు, నాలుగు అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు, ఇతర యుద్ధ సాధనాలు స్వాధీనం చేసుకున్నామని జనరల్ రణ్ వీర్ చెప్పారు. ఉగ్రవాదులంతా జైష్ ఏ మొహమ్మద్ సంస్థకు చెందినవారిగా భావిస్తున్నామన్నారు. ఉగ్రవాదుల నుంచి సేకరించిన వస్తువులే కాక, ఇతర ఆధారాలు సైతం వారు పాకిస్థాన్ కు చెందినవారేననే విషయాన్ని తెలుపుతున్నాయని, ఈ మేరకు లభించిన ఆధారాల వివరాలను పాకిస్థాన్ ఆర్మీ ఆపరేషన్స్ చీఫ్ కు ఫోన్ చేసి తెలిపామని రణ్ వీర్ పేర్కొన్నారు. ఉగ్రవాదులు, వారిని ప్రోత్సహించే దుష్ట శక్తులను అంతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ సర్వసన్నద్ధంగా ఉన్నందని ఆయన వ్యాఖ్యానించారు. యురి స్థావరంలోపలేకాక చుట్టు పక్కల ప్రాంతాలనూ భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయని తెలిపారు.