పాక్ ను దెబ్బతీసేందుకు భారత్ వ్యూహం ఇదే!
జమ్ముకశ్మీర్ లోని యూరిలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ ను ఎలా ఎదుర్కోవాలనే విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన కేబినెట్ సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. 18 సైనికులను అమానుషంగా పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్ కు అన్ని విధాలా గట్టి జవాబు చెప్పాలనే డిమాండ్ దేశ ప్రజల నుంచి వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ను గట్టి దెబ్బతీసేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాల సమాచారం. అన్ని అంతర్జాతీయ వేదికల మీద దాయాది తీరును ఎండగట్టాలని, దౌత్యపరంగా ఆ దేశాన్ని ఏకాకిని చేయడమే సత్వర లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పరీకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ తోపాటు ప్రధాని కార్యాలయం, రక్షణ, హోం మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రతి అంతర్జాతీయ వేదికపైనా పాక్ ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలని, ఇందులో భాగంగా ఉగ్రదాడుల్లో పాకిస్థాన్ పోషిస్తున్న పాత్రను అంతర్జాతీయంగా బట్టబయలు చేసేలా స్పష్టమైన ఆధారాలు సేకరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో దాయాదికి గట్టి బుద్ధి చెప్పాలని నిశ్చయించినట్టు సమాచారం. పాక్ ను కార్నర్ చేసేందుకు అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినప్పటికీ, వాటిని మరింతగా చర్చించి సమగ్ర నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.