సక్రమంగా ప్రభుత్వ పథకాల అమలు
- పాడేరు, చింతపల్లి, అనంతగిరిల్లో సబ్ డ్రగ్‌స్టోర్లు
- జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్
పాడేరు: ఏజెన్సీలో ప్రభుత్వ పథకాలన్నీ సంపూర్ణంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఐటీడీఏ సమావేశ మందిరంలో ప్రభుత్వ పథకాల అమలుపై అన్నిశాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాడేరు,చింతపల్లి, అనంతగిరి మండల కేంద్రాల్లో సబ్ డ్రగ్ సోర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిర్మాణాలు పూర్తయిన పాఠశాలల అదనపు తరగతి గదులు,పీహెచ్‌సీలు, సంబంధిత శాఖకు అప్పగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఏజెన్సీలో చెక్‌డ్యాంలు మరమ్మతుల గురించి ఆరా తీశారు. పాఠశాలలు తెరవకపోతే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని, అధికారులు గ్రామాల్లో పర్యటించినప్పుడు పాఠశాలలు తెరవని పరిస్థితి ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. ఆశ్రమ విద్యార్థినులకు ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగాలపై మహిళా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇంజినీరింగ్ పనుల్లో టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై పోలీసు కేసులు నమోదు చేయాలన్నారు.
వారానికో రోజు జిల్లా అధికారి పర్యటన
వారానికో రోజు జిల్లా అధికారులు ఏజెన్సీలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని, ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్ సూచించారు. ఏజెన్సీలో ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. మన్యానికి మరో 9 అంబులెన్సులు సమకూర్చాలని, గన్నెల పీహెచ్‌సీ పరిధిలో ఉన్న గ్రామాల్లో మలేరియా మందు పిచికారీ పనులు పూర్తి కాలేదని, దీనిపై సబ్‌యూనిట్ అధికారిణి సస్పెన్షన్‌కు సూచించారు. పిచికారీ పనులు చేయించే బాధ్యత సబ్‌యూనిట్ అధికారులదే అన్నారు. ఆయా మండలాల్లో తహశీల్దార్లు, ఎంపీడీవోల సహకారం తీసుకోవాలన్నారు. కిలగాడ పీహెచ్‌సీ భవనం నిర్మాణానికి మంజూరు ఉత్తర్వులు మళ్లీజారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. చింతపల్లి సీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా, ముంచంగిపుట్టు పీహెచ్‌సీని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేయాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకాలు చేపట్టాలన్నారు.
పాడైన అంగన్వాడీ కేంద్రాల మరమ్మతులకు రూ. లక్ష చొప్పున నిధులివ్వాలన్నారు. ఇంజరి రోడ్డు జీపీఎస్ సర్వే ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి.మాడుగుల, అనంతగిరి మండలాల్లో తాగునీటి పథకాలు మంజూరు చేశామని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 273 గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యం లేదని, 1091 గ్రావిటీ పథకాలను మంజూరు చేశామని, వాటిని వేగంగా పూర్తి చేయాలన్నారు. జి.మాడుగుల వయా నుర్మతి, బంగారుమెట్ట రహదారి పనులు, పాడేరు, అరకు ఘాట్‌రోడ్లు అభివృద్ధి పనులు, ఏజెన్సీలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు 283 క్వింటాళ్ళ విత్తనాలు సేకరిస్తున్నామని, తెల్లరాజ్‌మా మండలానికి 100 ఎకరాల్లో పండించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఉప ప్రణాళికలో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. ఏజెన్సీలో అంగన్‌వాడీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించడం లేదని, గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాలలో భోజనాలు చేస్తున్న దాఖలాలు లేవని, దీనిపై ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీడీఏ ఏపీవో పీవీఎస్‌నాయుడు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ సిహెచ్ మహలక్ష్మి, గిరిజన సంక్షేమ ఈఈ ఎంఆర్‌జీ నాయుడు, పీఆర్‌ఈఈ ప్రభాకరరెడ్డి, డిఎల్‌పీఓ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ సరోజని పాల్గొన్నారు.
వైద్యసిబ్బంది భర్తీకి చర్యలు
ఏజెన్సీలో ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు పరిధిలో వైద్య సిబ్బంది ఖాళీలను భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదించామని జిల్లా కలెక్టర్ యువరాజ్ వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ పీజీ రెసిడెన్సీ డాక్టర్లతో ఏరియా ఆస్పత్రులలో వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అలాగే పీహెచ్‌సీ, సబ్‌సెంటర్ల పరిధిలో 220 మంది పారామెడికల్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిపై నియమించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. ఏజెన్సీలో ప్రస్తుతం మలేరియా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఏజెన్సీలోని అనంతగిరి, జీకేవీధి మండలాల్లోని 6 పీహెచ్‌సీల్లో మలేరియా తీవ్రతను గుర్తించి ప్రత్యేక వైద్యబృందాలతో వైద్యసేలు అందిస్తున్నామన్నారు.