పక్కాగా ప్రభుత్వ భూ వివరాల నమోదు
వీడియో కాన్పరెన్స్‌లో సీసీఎల్‌ఏ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ భూముల జాబితాలను పక డ్బందీగా తయారు చేసి రెండు, మూడు రోజుల్లో పంపాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునీత్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం హైద్రాబాద్ నుంచి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ భూముల వివరాలను 5 రకాల జాబితాల్లో పొందుపరచాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. 1 నుంచి నాలుగు జాబితాల వివరాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపేందు కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలున్న భూములతో సహా అన్ని ప్రభుత్వ భూముల వివరాలను జాబితాల్లో చేర్చాలన్నారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమంలో వచ్చిన అన్ని రకాల భూ సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. నూజివీడు హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ డెరైక్టర్ చక్రపాణి మాట్లాడుతూ కొత్తగా చేరిన వీఆర్‌ఓలను ఏప్రిల్ 11 నుంచి 3 రోజుల శిక్షణకు పంపాలన్నారు. రాయలసీమ వారికి శ్రీకాలహస్తిలో శిక్షణ ఉంటుందన్నారు. కర్నూలు నుంచి జేసీ హరికిరణ్ మాట్లాడుతూ కర్నూలు, అవుకు మండలాలు మినహా అన్ని మండలాల ప్రభుత్వ భూముల వివరాలు సిద్ధం చేసినట్లు వివరించారు. కర్నూలు నుంచి వీడియో కాన్పరెన్స్‌లో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ, డీ సెక్షన్ సూపరింటెండెంట్ అన్వర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.