సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, శాసనమండలి ప్రొరోగ్ వివాదం ముగిసింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ సంబంధిత పత్రాలను శనివారం ప్రభుత్వానికి పంపారు. మండలిని కూడా ప్రొరోగ్ చేస్తూ చైర్మన్ చక్రపాణి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రొరోగ్ అంశం సీఎం-స్పీకర్ వివాదంగా మారి తీవ్ర చర్చకు దారి తీయడం తెలిసిందే. చివరికి కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో ఈ వివాదంపై సీఎం కార్యాలయ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఆర్డినెన్సుల జారీకి అడ్డంగా ఉందనే కారణంతోనే అసెంబ్లీని పొరోగ్ చేయాలంటూ లేఖ రాసినట్టు వివరించాయి. వివాదం సద్దుమణగడంతో ప్రొరోగ్ లేఖలను చైర్మన్, స్పీకర్ శనివారం ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. అయితే స్పీకర్ పంపిన ప్రొరోగ్ లేఖ శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ద్వారా సీఎంఓకు, అక్కడి నుంచి గవర్నర్‌కు చేరాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ప్రొరోగ్‌తో అనుమానాలు: శ్రీధర్‌బాబు
శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నందున సభను ప్రొరోగ్ చేయడం వల్ల అనేక సందేహాలు నెలకొనే అవకాశాలున్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. దీన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. స్పీకర్ సీమాంధ్రకు చెందిన వ్యక్తి కావడం వల్ల అపోహలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేయవద్దని గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పారు. సబ్సిడీ గ్యాస్‌కు ఆధార్‌ను అనుసంధానించే విషయంలో కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ విషయంలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. ఆధార్ పొందటం వల్ల అన్ని విధాలా ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రొరోగ్ వివాదానికి తెర
Published Sun, Nov 24 2013 1:35 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement