
అనంతపురం: ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎంపీ అనంత, కార్యకర్తలు, అభిమానులు (ఇన్‌సెట్) స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసిన దృశ్యం
జగమంత కుటుంబంలో కలకలం రేగింది. తమ గుండెల్లో నిలుపుకున్న మనిషిపై ఓ దుర్మార్గుడు కత్తిదూసిన ఘటన ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రభుత్వ మోసపూరిత హామీలతో విసిగిపోయిన ప్రజానీకాన్ని ఓదార్చి భవిష్యత్‌పై భరోసా కల్పించేందుకు కాలి నడకన వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంతోఒక్కసారిగా అభిమానులు రోడ్డెక్కారు. ప్రభుత్వ తీరుతో పాటు పోలీసుల ధోరణిపై దుమ్మెత్తి పోశారు. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. అనంతపురంలో అండగా మేమున్నామని బంద్ పాటించారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణుల నిరసన ఉవ్వెత్తున ఎగిసింది. ఇద్దరు అభిమానులు ఏకంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంత అట్టుడికింది.. నిరసన జ్వాల నింగినంటింది.. ఆత్మీయ నేత∙కోసం ఆవేశం పెల్లుబికింది.. ధర్నాలు.. రాస్తారోకోలతో దద్దరిల్లింది. విపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. దాడి ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లాలోని 14 నియోజకవర్గ కేంద్రాలతో పాటు దాదాపు అన్ని మండల కేంద్రాల్లో స్థానిక నేతలు రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు చేపట్టి నిరసన తెలిపారు. పలుచోట్ల ప్రభుత్వ దిష్టిబొమ్మలనుదహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్‌పై దాడి హేయమైన చర్య అని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ముక్తకంఠంతో నినదించారు.
♦ జగన్‌పై దాడి జరిగిన వెంటనే వైఎస్సార్‌సీపీ నేతలు అనంతపురంలోని టవర్‌క్లాక్ వద్దకు చేరి ఓవర్‌బ్రిడ్జిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. చూస్తుండగానే భారీ సంఖ్యలో కార్యకర్తలు పోగయ్యారు. వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, రాగేపరుశురాం, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వైటీ శివారెడ్డిలు చేరుకున్నారు. అక్కడి నుంచి సుభాష్‌రోడ్డు, శ్రీకంఠం సర్కిల్, పాతూరు, గాంధీబజారు మీదుగా నగరమంతా ర్యాలీ చేపట్టి బంద్ చేయించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. సప్తగిరి సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సూరీ అనే కార్యకర్త పాతూరు మున్సిపల్ కాంప్లెక్స్‌పైకి ఎక్కి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
♦ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఆధ్వర్యంలో పెనుకొండలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ సర్కిల్‌లో బైఠాయించి ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బలవంతంగా నేతలను అదుపులోకి తీసుకుని రాస్తారోకో భగ్నం చేసేందుకు యత్నించారు. దీంతో శంకర్‌నారాయణ వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు.
♦ రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి వినాయక్ సర్కిల్ వరకూ నల్లబ్యాడ్జీలతో ర్యాలీ చేపట్టి మానవహారం నిర్వహించారు. ఇది ప్రభుత్వ కుట్ర అని, ప్రతిపక్షం లేకుండా చేస్తామని పదేపదే చెప్పే చంద్రబాబు తన మాటను నిజం చేసేందుకే ఈచర్యకు పూనుకున్నారని ఆరోపించారు.
♦ కదిరిలో సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో చెన్నై జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఇందిర సర్కిల్‌లో బైఠాయించారు. కదిరి పట్టణ బీసీ సెల్ కన్వీనర్ ఆంజనేయులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. సిద్ధారెడ్డి జోక్యం చేసుకుని నీళ్లుపోసి అడ్డుకున్నారు. తర్వాత పోలీసులు సిద్ధారెడ్డితో పాటు నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
♦ కళ్యాణదుర్గంలో సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో టీసర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అరగంటసేపు పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కంబదూరులో దుకాణాలు, కార్యాలయాలు మూయించి బంద్ చేయించారు. శెట్టూరులో సీఎం దిస్టిబొమ్మను దహనం చేశారు. బ్రహ్మసముద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
♦ గుంతకల్లులో సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రభుత్వ దిష్టిబొమ్మతో పట్టణంలో ర్యాలీ చేపట్టారు. పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం జరిగింది. గుత్తి, పామిడిలో కూడా ఆందోళనలు చేపట్టారు.
♦ హిందూపురంలో సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సద్భావన సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతిభద్రతలలో విఫలమైన ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేయాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి కోలుకోవాలని పేట వెంకటరమణ స్వామి ఆలయం వద్ద 108 టెంకాయలు కొట్టి పూజలు చేశారు. మసీదు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
♦ మడకశిర నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మడకశిరలో సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి రాస్తారోకో చేపట్టారు. పోలీసులు బలవంతంగా నేతలను అరెస్టు చేసేందుకు యత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిప్పేస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం ఇంటికి వద్ద వదలిపెట్టారు.
♦ ఉరవకొండలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో కవితా హోటల్ సర్కిల్‌లో రాస్తారోకో నిర్వహించారు. విడపనకల్లులో నిర్వహించిన రాస్తారోకోలో కూడా ఆయన పాల్గొన్నారు. అన్ని మండలకేంద్రాల్లోనూ స్థానిక నేతలు ఆందోళనలు చేపట్టారు.
♦ తాడిపత్రిలో పోలీసుస్టేషన్ సర్కిల్‌లో వైఎస్సార్ సీపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కట్టుదిట్టం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌రెడ్డి పోలీసులకు వినతిపత్రం అందజేశారు.
♦ శింగనమల మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు ర్యాలీ చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయనపల్లి క్రాస్‌లో తాడిపత్రి–అనంతపురం హైవేపై రాస్తారోకో చేశారు.
♦ రాప్తాడు నియోజకవర్గం తగరకుంటలో తోపుదుర్తి చంద్రశేఖరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. చెన్నేకొత్తపల్లి, ఎన్‌ఎస్‌గేట్. ఆత్మకూరు, రాప్తాడులోనూ స్థానిక నాయకులు రాస్తారోకో చేపట్టారు.
♦ ధర్మవరంలో అధికారప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పాండురంగ సర్కిల్, కాలేజీ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముదిగుబ్బలో జాతీయరహదారిపై బైఠాయించారు. తాడిమర్రిలోనూ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
♦ పుట్టపర్తిలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో గణేశ్ సర్కిల్‌లో రాస్తారోకో చేపట్టారు. జగన్‌పై దాడిని ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుక్కపట్నంలో బుక్కపట్నం కేశప్ప ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అన్ని మండల కేంద్రాల్లోనూ ఆందోళనలు చేపట్టారు. కొత్త చెరువులో తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment