
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. సీఎంకు నిజంగా దమ్ముంటే ప్రైవేటు ఏజెన్సీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనను ఖండించాల్సిన సీఎం, మంత్రులు, అధికార పార్టీ నేతలు మాట్లాడిన తీరు వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ప్రజల దీవెనలు మెండుగా ఉన్న వైఎస్ జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
అనంతపురం: ‘‘పరిపాలనలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు.. రానున్న ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణ కల్గిన జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేకనే ఆయన్ను తుద ముట్టించేందుకు పన్నాగం పన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక కచ్చితంగా ప్రభుత్వ కుట్ర దాగి ఉంది. ఇది రాష్ట్రంలోని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కనిపిస్తోంది.. సీఎం చంద్రబాబు, ప్రభుత్వ యంత్రాంగం నిజాలను దాచిపెట్టి అసత్య ప్రచారాలు చేస్తూ, అసంపూర్తిగా దర్యాప్తును జరిపి ప్రజలను తప్పుదోవ పట్టించారు.’’ అని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, కదిరి సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి, హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, చిలకలూరి పేట సమన్వయకర్త విడదల రజిని, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు గయాజ్‌బాషా, డాక్టర్ మైనుద్దీన్, అనిల్‌కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ తీరు విస్మయానికి గురి చేస్తోంది
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఘటన జరిగిన వెంటనే విచారణ చేయించాలనే కనీస జ్ఞానం సీఎంకు లేకపోయింది. పైగా ప్రచారం కోసం చేసిన ఘటన అంటూ స్వయంగా డీజీపీ ప్రకటించడం, తర్వాత సీఎం విలేకరులతో వైఎస్సార్‌సీపీ వారే చేసుకున్నారంటూ హేళనగా మాట్లాడారు. సినీనటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడలో భాగంగానే ఈ ఘటన జరిగిందంటూ తప్పుదారి పట్టించేలా సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం సిగ్గుచేటు. 7 నెలల కిందట శివాజీ ప్రెస్‌మీట్ పెట్టి ఆపరేషన్ గరుడ గురించి చెబితే మీ ప్రభుత్వం కాని, పోలీసు వ్యవస్థ కానీ ఎందుకు ఆలోచించలేదు, 13 ఏళ్ల ముఖ్యమంత్రి అనే చెప్పుకునే నీకు కనీస జ్ఞానం లేదా?. శివాజీ చెప్పినట్లే నమ్మి ఉంటే వెంటనే ఆరెస్ట్ చేసి విచారణ చేయాలి. అంతేకానీ శివాజి చెప్పిన అపరేషన్ గరుడలా జరుగుతోందని చెప్పడం సిగ్గుగా లేదా?. వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలూ ఖండించాయి. సీ ఎం మాత్రం కేసును నీరు గార్చేందుకు పాట్లు పడుతున్నారు. ఘటన జరిగిన గంటన్నరలోపే డీజీపీ విశాఖలో లేకపోయినా నిందితుడి కులం, ఇతర కీలక వివరాలు ఎలా సేకరించారు?. సరైన ఆధారాలు లేకపోయినా నిందితుడు జగన్ అభిమాని అని ఆయన ఎలా చెప్పగలిగారు? దీన్నిబట్టి చూస్తుంటే కేవలం అసత్యాన్ని ప్రచారం చేసేందుకే డీజీపీ మాట్లాడారని స్పష్టమవుతోంది. అ«ధికార పార్టీ అనుకున్నట హత్యాప్రయత్నం సక్సెస్ కాలేదు కాబట్టే బెదురుకునే కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై అంపశయ్యపై ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యా ప్రయత్నం టీడీపీ ప్రమేయం లేకపోతే ధైర్యంగా థర్డ్ పార్టీ విచారణను కోరాలి.– అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ
నువ్వు పంచనామాకు అటెండయ్యావా?
వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఇంక్వెస్ట్ కాలేదు.. పంచనామా కాలేదని చెబుతున్న చంద్రబాబు... ఆ రోజు అలిపిరిలో తనపై నక్సలైట్లు బాంబులు పెట్టి దాడి చేసినప్పుడు ఎందుకు పంచానామా చేయించుకోలేదో చెప్పాలి. తిరుపతిలో ప్రాథమిక చికిత్స చేయించుకుని నేరుగా హైదరాబాద్ వచ్చి చికిత్స చేయించుకున్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని అస్తిరపరచాల్సిన అవసరం వైఎస్సార్‌సీపీకి లేదు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆయనను పరామర్శిస్తే అదంతా కుట్ర అని చంద్రబాబు ఏకారణంతో చెబుతారు?. అదే కారణంతో తన మిత్రపక్ష పార్టీ (తెలంగాణ కాంగ్రెస్)కి చెందిన నేతలు పరామర్శిస్తే ఎందుకు కుట్రగా భావించలేదు. – వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ
అధికార పక్షం కుట్ర
వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం...అధికార పక్షం చేసిన కుట్ర. నిందితుడి అధికారిక ఫొటోను విడుదల చేయకముందే అతని నేపథ్యం, ఏడా ది కిందట పోస్టరును టీడీపీకి సంబంధించిన మీడియా సంస్థలు గంటలోపే ఎలా సేకరిం చాయి? సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలో రోజాపువ్వు ఉంటే, మొదట చూపించిన హెచ్‌డీ ఫొటోలో ఆ çపువ్వు లేక పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ, జనసేన, టీఆర్‌ఎస్ నాయకులు జగన్ మీద జరిగిన హత్యాయత్నాన్ని ఖండించారు. కాబట్టే వారుకూడా కుట్రలో భాగమని ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన సంస్థలతో విచారణ జరిపించి నిజానిజాలను వెలికి తీయాలి. – శంకరనారాయణ, వైఎస్సార్‌సీపీహిందూపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు
ప్రజాస్వామ్యం ఖూనీ
వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనను చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని స్పష్టమవుతోంది. ఈ ఘటనపై రాష్ట్రప్రజలను తప్పుదోవ పట్టించిన డీపీజీపై రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి, మంత్రులు నారా లోకేష్, గంటా శ్రీనివాస్‌లతో ఉన్న సంబంధాలను రిమాండ్ రిపోర్ట్‌లో ఎందుకు పేర్కొనలేదు. వైఎస్ జగన్‌పై హత్యాతయ్నం.. అపరేషన్ గరుడలో భాగమేనని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. నిఘా వర్గాల దగ్గర సైతం లేని సమాచారం ఒక సినీనటుడికి ఎలా తెలిసింది. దీనిపై పోలీసులు శివాజీని ఎందుకు విచారించడం లేదు. జనవరిలో ముద్రించారంటూ ఒక ఫ్లెక్సీ బయటకు తీసిన పోలీసులు నిందితుడు ఎవరెవరితో ఏమేమి మాట్లాడారు...బ్యాంకు ఖతాలో జరిగిన లావాదేవీలను ఎందుకు బయటపెట్టడం లేదు. ప్రైవేట్ సంస్థలతో విచారణ చేయిస్తే తమ బండారం బయటపడుతుందనే రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. ముఖ్యమంత్రికి నిజంగా భయం లేకుంటే కేంద్ర సంస్థలతో విచారణను కోరాలి.
– నదీమ్ అహమ్మద్, వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment