గుండెల్లో పెట్టుకుంటా.. | YS Jagan Meeting in Anantapur | Sakshi
Sakshi News home page

గుండెల్లో పెట్టుకుంటా..

Published Tue, Feb 12 2019 12:51 PM | Last Updated on Tue, Feb 12 2019 12:51 PM

YS Jagan Meeting in Anantapur - Sakshi

దారులన్నీ ఒకటయ్యాయి.. గొంతులన్నీ ఒకే మాట పలికాయి.. గుండెలన్నీ ఒకే పేరుతో ప్రతిధ్వనించాయి.. గూడుకట్టుకున్న వేదన ఓ వైపు.. గెలిపించి తీరాలన్న కసి మరోవైపు.. ‘పచ్చ’కోట కాదిదని తేల్చిచెప్పాలన్న బలమైన కాంక్ష మరోవైపు.. సోమవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘అనంత’ పర్యటనలో కనిపించిన దృశ్యమిది. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆప్తుడికి ‘అనంత’ ఘన స్వాగతం పలికింది. జిల్లా సరిహద్దు నుంచి అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ సంబరపడిపోయింది. తటస్థుల సమావేశం, ఆ తర్వాత సమర శంఖారావ సభలోనూ జగన్నినాదం మార్మోగింది. జననేత ప్రసంగం అభిమానులకు భరోసానివ్వగా.. ఎందరికో భవిష్యత్‌ మార్గనిర్దేశం చేసింది.

సాక్షి బృందం, అనంతపురం :  కరువుకు నిలయమైన ‘అనంత’ జన జాతరను తలపించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా అభిమాన సంద్రమైంది. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో సోమవారం వైఎస్‌ జగన్‌ ‘సమర శంఖారావం’ పేరుతో  పార్టీ శ్రేణులతో నిర్వహించిన సభ విజయవంతమైంది. ఉదయం జననేతకు సమస్యలు చెప్పుకోవడానికి తటస్థ ప్రభావితులు బారులు తీరితే.. మధ్యాహ్నం ప్రజానేతను చూడటానికి, ప్రసంగాన్ని వినడానికి ప్రజలు మండుటెండతో పోటీపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై జననేత ఇచ్చిన హామీ తటస్థ ప్రభావితుల్లో కొండంత ధైర్యాన్ని నింపితే.. కష్టాల కడగండ్లను కడతేర్చేందుకు ప్రజానేత ఇచ్చిన భరోసా ప్రజలను ఆనందోత్సాహాల్లో నింపింది. అటు తటస్థ ప్రభావితులు.. ఇటు కార్యకర్తలు.. ఇంకో వైపు ప్రజలు పోటెత్తడంతో ‘అనంత’ జన సంద్రమైంది.

శంఖారావం విజయవంతం
సోమవారం అనంతపురం వేదికగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమర శంఖారావం సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. భారీ జన సందోహం మధ్య వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాన్ని నింపింది.

విద్యావైద్యానికి ప్రాధాన్యం
హైదరాబాద్‌ నుంచి సోమవారం ఉదయం విమానంలో బెంగళూరుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురానికి చేరుకున్నారు. తొలుత నగరంలోని శ్రీ సెవెన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో  తటస్థులతో సమావేశమయ్యారు. ‘సమాజానికి మేలు చేస్తున్న మిమ్మిల్ని గుర్తించి మీకు ప్రత్యేకంగా లేఖలు రాసి.. ఆహ్వానించా. సుపరిపాలనలో భాగం కావాలని ఆహ్వానిస్తున్నా. మెరుగైన పాలన అందించడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నా. మీరందరూ నా శ్రేయోభిలాషులు.. ఈ బంధం ఇక్కడితో ఆగిపోదు.. ఎప్పటికీ కొనసాగుతుంది’ అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రారంభోపన్యాసం తటస్థ ప్రభావితులను కట్టిపడేసింది. విద్య, వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తూ పేదలను చంద్రబాబు సర్కార్‌ వేధిస్తుండటాన్ని తటస్థులు జననేతకు వివరించారు. ఆ రెండు రంగాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న తటస్థుల సూచనతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏకీభవించారు. ‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోగా ప్రభుత్వ పాఠశాలు, ఆస్పత్రుల రూపరేఖలు మార్చి చూపిస్తా.. జగన్‌ అయినా సరే అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకునే స్థాయికి అభివృద్ధి చేస్తా’ అంటూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ తటస్థులను ముగ్ధులను చేసింది. 

సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా ఇన్‌చార్జ్‌ పెద్దిరెడ్డి మి«థున్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి కడపల శ్రీకాంత్‌రెడ్డి.. అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్‌ తిప్పేస్వామి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త తలారీ పీడీ రంగయ్య, హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త గోరంట్ల మాధవ్, సమన్వయకర్తలు కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వై.వెంకటరామిరెడ్డి,  సిద్దారెడ్డి, ఉషాశ్రీ చరణ్, అబ్దుల్‌ఘని, జొన్నలగడ్డ పద్మావతి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, మహాలక్ష్మీ శ్రీనివాసులు, రాగే పరశురాం, నదీమ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైటీ శివారెడ్డి, పైలా నరసింహయ్య, గంగుల భానుమతి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజినేయులు, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె. రమేష్‌రెడ్డి, వై.మధుసూదన్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, మహిళా విభాగం అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, ఏడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ లింగాల శివశంకర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ రాజారాం, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, వేపకుంట రాజన్న, మాజీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి,  నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి  పాల్గొన్నారు.  

నవరత్నాలతో రూపురేఖలు మారుస్తా
పక్షం రోజులతో పోల్చితే సోమవారం అనంతపురంలో ఎండ తీవ్రత పెరిగింది. షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు నేషనల్‌ హైవేలోని అశోక్‌ లేలాండ్‌ షోరూం ఎదురుగా ఉన్న మైదానంలో సమర శంఖారావం సభాస్థలికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకోవాలి. అనంత వీధుల్లో జన సందోహం పోటెత్తడంతో మధ్యాహ్నం 2.50 గంటలకు సభాస్థలికి చేరుకున్నారు. మండటెండను కూడా లెక్క చేయకుండా ప్రజలు జననేత కోసం వేచిచూశారు. అభిమాన నేతను చూడగానే కేరింతలు కొట్టారు. గత ఎన్నికల్లో వ్యవసాయ రుణాల మాఫీ.. డ్వాక్రా రుణాల మాఫీ వంటి 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా చంద్రబాబు చేసిన మోసాన్ని వివరిస్తూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాలతో రాష్ట్రం రూపురేఖలనే మార్చివేస్తానని హామీ ఇస్తూ చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచింపజేసింది. ఈటెల్లాంటి మాటలతో ప్రభుత్వ వైఫల్యాలను  కడిగిపారేస్తూ చేసిన విమర్శలకు ప్రజలను నుంచి భారీ స్పందన లభించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ముగించి.. ధన్యవాదాలు తెలిపి.. సభావేదిక నుంచి నిష్క్రమించే వరకూ జనం కట్టుకదలకపోవడాన్ని బట్టి చూస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ వెంట ‘అనంత’ నడవడం ఖాయమని జిల్లా నిఘా విభాగానికి చెందిన కీలక అధికారి సభా ప్రాంగణంలో వారి సిబ్బందితో చర్చిస్తూ వ్యాఖ్యానించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement