కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద భైఠాయించిన వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వైఎస్ జగన్‌పై దాడి జరిగిందని తెలిసిన వెంటనే అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. భారీ సంఖ్యలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న అభిమానులు, కార్యకర్తలు ధర్నాలతో, రాస్తా రోకోలతో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు.
కర్నూలు : వైఎస్ జగన్‌పై జరిగిన దాడికి నిరసనగా కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు వైసీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో, ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలో పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, పత్తికొండ ఇంచార్జ్ కంగాటి శ్రీదేవి, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, ఇతర పార్టీ శ్రేణులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం : వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. నల్లమాడ, ఓడిసి, ఆమడగూరు, కొత్తచెరువు, పుట్టపర్తి మండల కేంద్రాలలో వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
చిత్తూరు : విశాఖ ఎయిర్ పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై దాడికి నిరసనగా పీలేరు క్రాస్ రోడ్డులో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆందోళనల బాటపట్టారు. కే.వీ.బీపురంలో వైసీపీ సమన్వయకర్త కోనేటి అదిమూలం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు చేపట్టారు.
వైఎస్సార్ కడప : వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాప్రయత్నాన్ని తట్టుకోలేక వేంపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణ గొంతు కోసుకోవడానికి ప్రయత్నించాడు. అతన్ని పార్టీ శ్రేణులు ,పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్‌పై దాడికి నిరసనగా ఓబులవారిపల్లె క్రాస్ రోడ్డు వద్ద మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.
తూర్పుగోదావరి : విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో దేవి చౌక్ వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో వరసాల ప్రసాద్, కర్రి సూరారెడ్డి, అక్షింతల రాజా , నరాలశెట్టి నర్సయ్య , నల్లల వెంకన్నబాబులు పాల్గొన్నారు.
ప్రకాశం : వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై దాడిని సంతనూతలపాడు సమన్వయకర్త టీజేఆర్ సుధాకర్ బాబు ఖండించారు. తక్షణమే సినిమా హీరో శివాజీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా యర్రగొండపాలెంలో రోడ్డుపై భారీ సంఖ్యలో బైఠాయించిన కర్యాకర్తలు తమ నిరసన వ్యక్తం చేసారు.
పశ్చిమగోదావరి : వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని భీమవరం వైఎస్సార్ సీపీ నేతలు కొయ్యే మోసేన్ రాజు, గాదిరాజు సుబ్బరాజులు ఖండించారు. హత్యాయత్నాన్ని ఖండిస్తూ కొయ్యలగూడెంలో కార్యకర్తలు రోడ్డుపై భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
విజయవాడ : వైఎస్ జగన్‌పై హత్యాయత్నాన్ని నిరసిస్తూ ముస్లీం మైనార్టీలు ఆందోళన చేపట్టారు. విజయవాడ వన్ టౌన్ పంజాసెంటర్‌లో ముస్లీంలు ధర్నా చేశారు. హత్యాయత్నం వెనుక కుట్రకు కారకులైన వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
విశాఖపట్నం : వైఎస్ జగన్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ వైస్సార్ సీపీ శ్రేణులు జాతీయ రహదారిపై బైటాయించారు. దీంతో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాల్సిన భారత్, వెస్ట్ ఇండీస్ జట్లు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి
శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడికి నిరసనగా ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయ కర్త గొర్లె కిరణ్ కుమార్ ఆద్వర్యంలో రణస్థలం జాతీయ రహదారిపై కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
నెల్లూరు : వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా కోవూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు.
విజయనగరం : వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు మానవహారం చేపట్టారు. బొబ్బిలి సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో వాసిరెడ్డి జంక్షన్‌లో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎస్. కోటలో నియోజకవర్గ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడు బాబు, చిన్న రాము నాయుడు, టి. వరలక్ష్మీ భారీ సంఖ్యలో కార్య కర్తలు పాల్గొన్నారు.
కృష్ణా : వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతి పక్ష నేత వై ఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా కైకలూరులో 216వ జాతీయ రహదారిపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం పార్టీ కార్యాలయం మార్కేటు, సెంటరు వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొడ్డు నోబులు, నిమ్మగడ బిక్షలు, పాపారావు గౌడ్, యౌన సాయి నరసింహరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment