పెల్లుబికిన నిరసన | Protest In Tadipatri Against Prabonandha Swamy Ashram | Sakshi
Sakshi News home page

జేసీ బ్రదర్స్‌ రాజీనామా చేయాలి

Published Tue, Sep 18 2018 6:30 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 AM

Protest In Tadipatri Against Prabonandha Swamy Ashram - Sakshi

గుత్తిలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నర్సింహయ్య

తాడిపత్రి మండలం చిన్నపొలమడలో     గత రెండు రోజులుగా చోటుచేసుకున్న ఘటనలపై జిల్లా వ్యాప్తంగా నిరసన పెల్లుబికింది. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతోనే దాడులు జరిగాయని ఆరోపిస్తుంన్న భక్తులు.. కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఆధ్యాత్మిక ముసుగులో  ఆశ్రమంలో ఇంకేదో జరుగుతోందని పలు పార్టీల నేతలు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులను సైతం ఆశ్రమంలోకి రానివ్వకపోవడాన్ని వారు తప్పుపట్టారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు.   

అనంతపురం, గుత్తి: తాడిపత్రిలోని ప్రబోధానంద ఆశ్రమంపై దాడులు చేయించి, ఒకరి మృతి, అనేకమంది గాయపడటానికి కారకులైన జేసీ సోదరులు తక్షణమే ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆశ్రమంపై దాడులకు నిరసనగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నర్సింహయ్య నేతృత్వంలో వందలాదిమంది పార్టీ శ్రేణులు సోమవారం గుత్తిలో ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి గాంధీ సర్కిల్‌లో చేశారు. జేసీ బ్రదర్స్‌ (జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర కార్యదర్శి పైలా నర్సింహయ్య, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్‌ యాదవ్, గుత్తి పట్టణ, మండల కన్వీనర్లు పీరా, గోవర్దన్‌రెడ్డి, పెద్దవడుగూరు సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ గోవర్దన్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గూడూరు సూర్యనారాయణరెడ్డిలు మాట్లాడారు.  ప్రబోధానంద ఆశ్రమంపై దాడులు చేయించిన జేసీ సోదరులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు స్పందించి జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిలను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరారు.

జేసీ బ్రదర్స్‌ బఫూన్స్‌
జేసీ సోదరులను ఇలాగే వదిలేస్తే తాడిపత్రితో పాటు జిల్లా అంతటా లా అండ్‌ ఆర్డర్‌ దెబ్బతింటుందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. జేసీ బ్రదర్స్‌ బఫూన్‌లా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.  పోలీసులను, ఆశ్రమ నిర్వాహకులను బండబూతులు తిడుతున్నా, దగ్గరుండి తమ అనుచరులు, రౌడీలతో దాడులు చేయిస్తున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందన్నారు. జేసీ సోదరులను కట్టడి చేయకపోతే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పాశం రంగస్వామి, ఆవులాంపల్లి భాస్కర్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ నజీర్, జిల్లా కార్యదర్శులు గురు ప్రసాద్‌యాదవ్, సుభాష్‌రెడ్డి, శివయ్య, ఫారూక్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు నిర్మల, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి శామ్యూల్, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి భీమలింగ, జిల్లా నాయకులు సీవీ రంగారెడ్డి, బీసీ సెల్‌ జిల్లా నాయకులు కేఎం రంగనాయకులు, రాజన్న, జీపు రమణ,  పట్టణ కార్యదర్శి వెంకటేష్, సీనియర్‌ నాయకులు రంగప్రసాద్‌ రాయల్, ప్రసాద్‌గౌడ్, నారాయణస్వామి, క్రషర్‌ మధు, వరదా, గద్దల నాగరాజు, భాస్కర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, కేవీ రమణ, బూత్‌ కమిటీ కన్వీనర్‌ విశ్వనాథ్‌రెడ్డి, తురకపల్లి, చెర్లోపల్లి మాజీ సర్పంచులు ఎంసీ నాగరాజు, వెంకటేష్, «శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి, ఎస్టీ సెల్‌ నాయకుడు హనుమంతు, రామరంగారెడ్డి, మైనార్టీ నాయకులు ఫయాజ్, అఫ్సర్, రషీద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
తాడిపత్రి: తాడిపత్రి ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కాకతీయ కమ్మ సేవా సంఘం సభ్యులు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు. శని, ఆదివారాల్లో చిన్నపొలమడల్లో జరిగిన సంఘటనలు చాలా బాధాకరమని, ప్రబోదాశ్రమంపై దాడి చేయడాన్ని కమ్మసేవా సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. అదే విధంగా గ్రామానికి చెందిన వ్యక్తి మరణించడాన్ని, మరికొందరు గాయడటంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి, గాయపడ్డ వారికి తమ సానూభూతిని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రబోదాశ్రమంపై ఇకపై ఎలాంటి దాడులు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు.  తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘటనలపై త్వరలోనే జిల్లా కలెక్టర్, ఎస్పీలను కలవనున్నట్లు వారు పేర్కొన్నారు.  

మరో వారం 144 సెక్షన్‌
అనంతపురం సెంట్రల్‌: తాడిపత్రిలో శాంతిభద్రతలు అదుపులోకి వస్తున్నాయని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. తాడిపత్రి మండలం పెద్దపొలమడ గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. చిన్న పొలమడ వద్దగల ప్రబోధానంద ఆశ్రమ సమీపంలో మళ్లీ ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భారీ స్థాయిలో ప్రత్యేక బలగాలు తాడిపత్రికి వచ్చాయన్నారు. పట్టణంతో పాటు, ఆశ్రమ సమీపంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. మరో వారం రోజుల పాటు తాడిపత్రిలో 144 సెక్షన్, పోలీసు 30 యాక్టు అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రజలెవరూ గుంపులుగా చేరడం, సభలు, సమావేశాలు నిర్వహించడం చేయరాదని సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement