రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావంగా జిల్లాలో ఆ పార్టీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజైన ఆదివారమూ కొనసాగాయి. పట్టు సడలకుండా దీక్షల్లో పాల్గొని హోదా నినాదాన్ని హోరెత్తించారు. పార్టీ నాయకులకు జనం కూడా తోడు కావడంతో ఉద్యమం ఉద్ధృతమైంది.
చిత్తూరు, సాక్షి : జిల్లాలో వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, వంటా వార్పులతో నిరసన తెలియజేశారు. నగరి ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా స్థానిక క్లాక్‌టవర్ సమీపంలో రిలే నిరాహార దీక్ష చేశారు. నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ కేజే శాంతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని రోజా అన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోటలో పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరిగింది. దీక్ష అనంతరం జ్యోతిచౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. కుప్పం సర్కిల్‌లో జరిగిన రిలే నిరాహార దీక్షలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సత్యవేడు, నాగలాపురంలో జరిగిన దీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం పాల్గొన్నారు. చిత్తూరు గాం«ధీ సర్కిల్‌లో వైఎస్సార్ బీసీ, ఎస్సీ సెల్ యువజన విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
పార్టీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, జ్ఞానజగదీశ్, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలో జరిగిన దీక్షలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు పాల్గొన్నారు. ఈ దీక్షకు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సంఘీభావం తెలిపారు. శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో ఆ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. ఆ పార్టీ కార్యకర్త వాసుమయ్య గుండు కొట్టుకొని టీడీపీ, బీజేపీ ఎంపీలకు పిండ ప్రదానం చేశారు. తుడా సర్కిల్‌లో మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పలమనేరులో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు, వెదురుకుప్పం కార్వేటినగరం, ఎస్సార్‌పురం మండలాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. పెనుమూరు, వెదురుకుప్పంలో జరిగిన దీక్షలకు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి సంఘీభావం తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు, రొంపిచెర్లలో రిలే నిరాహార దీక్షలు జరి గాయి. రొంపిచెర్లలో జరిగిన దీక్షకు మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇబ్రహీంఖాన్ పాల్గొన్నారు. పుంగనూరులో రెడ్డెప్ప పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లిలో మండల నాయకులు వంటావార్పు, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పీలేరులో జరిగిన వైఎస్సార్ విద్యార్థి విభాగం దీక్షకు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. మదనపల్లె అన్నమయ్య సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు వంటావార్పు కార్యక్ర మం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment