సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్‌సెంటర్ నుంచి ప్రయోగించే పీఎస్‌ఎల్‌వీ సీ24 రాకెట్‌కు సంబంధించి చివరి మిషన్ సంసిద్ధతా (ఎంఆర్‌ఆర్) సమావేశం మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. అనంతరం రాకెట్‌ను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగిస్తారు. ఆ తర్వాత వారు ప్రయోగం, కౌంట్‌డౌన్ ప్రక్రియలపై తుదినిర్ణయం తీసుకుంటారు. ప్రయోగానికి 58.30 గంటల ముందు అంటే బుధవారం ఉదయం 6.44 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా మిషన్ కంట్రోల్ రూం నుంచి మంగళ, బుధవారాల్లో లాంచ్ రిహార్సల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ ప్రయోగంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన 1,432 కిలోల ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ) ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపుతున్న విషయం తెలిసిందే. కౌంట్‌డౌన్ ప్రారంభమైన తర్వాత రాకెట్‌లో దశల వారీగా ఇంధనం నింపుతారు. ప్రయోగానికి సంబంధించి పనుల పరిశీలనకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ ఈ నెల 3న షార్‌కు వస్తున్నారు.