పీఎస్‌ఎల్‌వీ సీ24 ప్రయోగానికి సర్వం సిద్ధం
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1బీ అనే ఉపగ్రహాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ సీ24) ద్వారా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ నెల 4న అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు పూర్తి చేశారు.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని షార్ బ్రహ్మప్రకాశ్ హాల్‌లో ఎంఆర్‌ఆర్ సమావేశాన్ని చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేశారు. రాకెట్ అనుసంధానం పూర్తిచేసి, అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి ఈ సందర్భంగా అప్పగించారు. శాస్త్రవేత్తలు ల్యాబ్ చైర్మన్ డాక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశమై... కౌంట్‌డౌన్ ప్రక్రియను బుధవారం ఉదయం 6.44 గంటలకు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్రయోగాన్ని 1,188.4 సెకెన్లలో పూర్తి చేయనున్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో ఇది 26వ ప్రయోగం కావడం విశేషం. ఇప్పటిదాకా నిర్వహించిన 25 ప్రయోగాల్లో మొదటి ప్రయోగం తప్ప మిగిలినవన్నీ విజయవంతమయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో ఆరోసారి చేస్తున్న ప్రయోగం ఇది. అంతేకాదు ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రెండోసారి తయారుచేసిన 1,432 కిలోల బరువైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించి వాణిజ్యపరంగా మరో అడుగు ముందుకేసింది.