ఉన్మాది బీభత్సం.. ప్రజల దేహశుద్ధి
► విశాఖలో ఏడుగురిని కత్తి, బ్లేడుతో గాయపరిచిన సైకో
► కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో శుక్రవారం రాత్రి ఆకస్మిక దాడులతో ప్రజలను భయభ్రాంతులను చేసిన ఉన్మాదికి దేహశుద్ధి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందాడు. వివరాలు.. విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతంలో బిహార్‌కు చెందిన ఓ ఉన్మాది (సైకో) శుక్రవారం రాత్రి స్థానిక ప్రజలపై చిన్నపాటి కత్తి, బ్లేడుతో దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశాడు. ఐటీఐ కూడలి నుంచి కంచరపాలెం ఫ్లైఓవర్ వంతెన కూడలి వరకు ఏడుగురికి గాయాలు పడేలా కత్తులతో పొడుచుకుంటూ వీరంగం సృష్టిం చాడు. దీంతో ప్రజలు తలోదిక్కు పారిపోయారు.
వారిని తరుముకుంటూ కంచరపాలెం మెట్టు వరకూ వెళ్లిన ఉన్మాదిపై స్థానిక ప్రజలు, పాదచారులు, వాహనదారులు కర్రలతో దాడి చేశారు. దీంతో ఉన్మాది స్పృహతప్పి కుప్పకూలి పోయాడు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐదో పట్టణ, ఎయిర్‌పోర్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సైకోను అదుపులోకి తీసుకున్నారు. గాయాలతో ఉన్న అతనిని 108 లో కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్మాది మృతి చెందాడు.