సైకో.. దెబ్బకు రైల్ రోకో
గుంతకల్లు: ఓ సైకో తన విపరీత చేష్టలతో రైల్వే పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని చేష్టల కారణంగా గుంతకల్లు రైల్వే జంక్షన్ నుంచి మూడు ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సికింద్రాబాద్ నుం చి బయల్దేరిన ప్యాసింజర్ రైలు మంగళవారం రాత్రి 10.30 గంటలకు గుంతకల్లు జంక్షన్ చేరింది.ఈ రైలును యార్డులో క్లీనింగ్ నిమిత్తం నిలిపారు. బోగీలు, బాత్‌రూంలను శుభ్రపరచడానికి వెళ్లిన క్లీనింగ్ బాయ్స్ ఓబోగీలోని బాత్‌రూం లోపలివైపున గడియ వేసుకొని ఓ వ్యక్తి కేకలు పెడుతుండటాన్ని గుర్తించారు.
అతని చేతిలో ఇనుపరాడ్, కత్తి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులకు సమాచా రమిచ్చారు. వారు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి సైకో ఉన్న లావెట్రీ తలుపులు తీయడానికి ప్రయత్నించారు. స్పందన రాలేదు. దీంతో పోలీసులు కిటికీ వద్దకు చేరుకొని అతని వివరాలు ఆరా తీశారు. తన పేరు నరసింహ అని, సికింద్రాబాద్‌లోని కొత్తపేట అని చెప్పాడు.
బుధవారం ఉదయం కూడా అదే పరిస్థితి ఉండడంతో చివరకు ఓ పోలీసును బోగీ వద్ద కాపలా ఉంచి వెళ్లిపోయారు. అతనికి ఆకలిగా ఉందని చెప్పడంతో టిఫిన్ తీసుకొచ్చి కిటికీలో నుంచి సైకోకు అందించాడు. టిఫిన్ తిన్నాక... కానిస్టేబుల్ ఒక్కరే ఉన్నారని గుర్తించిన సైకో బాత్‌రూమ్ తలుపు తీసుకొని బయటికి వచ్చాడు. అప్పటికే బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఉడాయించాడు.