కాకినాడ క్రైం :ప్రజారోగ్య కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధులు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో వేళ్లూనుకున్న నిర్లక్ష్యం కారణంగా వెనక్కి మళ్లిపోతున్నాయి. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) చైర్మన్ ఎం.రవిచంద్ర రూ.50 లక్షలు విడుదల చేసి వాటితో మందులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. కేవలం రూ.7లక్షలతో మందులు కొనుగోలు చేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మిగిలిన డబ్బు మురగబెట్టారు. దీంతో మిగిలిపోయిన రూ.43 లక్షలు వెనక్కి ఇచ్చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా అధికారులు ఆమేరకు చర్యలు చేపట్టారు. అయితే వ్యాధుల నియంత్రణకు మంజూరైన నిధుల వినియోగంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రచారమే ఫలితమిస్తుందా?
సీజనల్ వ్యాధుల విషయంలో కేవలం ప్రచారాలు సాగిస్తే సరిపోతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయనేది వాస్తవం. ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణకు మండలానికి రూ. తొమ్మిది వేలు చొప్పున కలెక్టర్ నీతూ ప్రసాద్ విడుదల చేశారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో విద్యార్థులతో ర్యాలీలు, కరపత్రాల పంపిణీ, ఫ్లెక్సీల ఏర్పాటు వంటివి చేయాలని ఎంపీడీఓలకు ఆదేశాలిచ్చారు. పారిశుధ్యంపై దృష్టి పెట్టకుండా ఇలా ప్రచారాలు సాగిస్తే మాత్రం ఫలితం ఏమిటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పారిశుధ్యంపై అంతులేని అలసత్వం
జిల్లావ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలపై అలసత్వం నెలకొంది. సుమారు 90 శాతం గ్రామాలలో డంపింగ్ యార్డులు లేవు. దీంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడ చూసినా దోమలు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వర్షాకాలంలో విజృంభించే డెంగీ, మలేరియా, కలరా, అతిసార, పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధుల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖలో ఏ మాత్రం అప్రమత్తత కనిపించడం లేదు. ఆహారం, తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థలపై దృష్టి సారించి ప్రజారోగ్యం కాపాడడంలో పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల క్షేత్రస్థాయి సిబ్బంది విఫలమవుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గత ఏడాది జిల్లాలో 35 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే ఐదు డెంగీ కేసులు నమోదైనా అధికారుల్లో చలనం కనిపించడం లేదు.
రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా కనిపించని ఫలితం
దోమ లార్వాను నాశనం చేసేందుకు జిల్లాలోని 1006 పంచాయతీలకు 10,750 లీటర్లు, రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలకు 2000 లీటర్ల చొప్పున మస్కిటో లార్వాసిడ్ ఆయిల్‌ను సరఫరా చేసినట్టు శాఖాధికారులు చెబుతున్నారు. అయితే ఈ మందును పిచికారీ చేసిన దాఖలాలు మాత్రం లేవని ప్రజలు చెబుతున్నారు. జూన్ 25 నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపట్టినప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పారిశుధ్య నిర్వహణకు జిల్లాకు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటికి రూ.14 కోట్లు ఖర్చు చేశారు కూడా. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 109 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 23 క్లస్టర్లు, 20 అర్బన్ హెల్త్ సెంటర్లు, 805 సబ్ సెంటర్లలో వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 4500 మంది ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. అయినప్పటికీ పరిసరాల పరిశుభ్రత ఎక్కడా కానరావడం లేదు. అంటువ్యాధులపై ప్రజలకు అవగాహన కూడా కల్పించడంలో కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిర్లక్ష్యం
Published Wed, Aug 13 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:47 AM
Advertisement
Advertisement