కాకినాడ : ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై ఏప్రజల సమస్యా పరిష్కారానికి నోచుకోని నేపధ్యంలో గడపగడపకూ వైఎస్‌ఆర్ పేరిట ప్రజల మధ్యకు వెళ్తున్న పార్టీ నేతలకు మంచి స్పందన కనిపిస్తోంది. తమ గోడు వినేందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు సమస్యలు విన్నవిస్తున్నారు. రెండేళ్ళుగా పడుతున్న కష్టాలు తెలియజేస్తున్నారు. ఓ వైపు ప్రజా సమస్యలు వింటూ మరో వైపు మీ వెంటే మేమున్నామంటూ భరోసానిస్తూ పార్టీ నేతలు ముందుకు సాగిపోతున్నారు.
ఉపాధి పనుల్లోనూ వివక్షతే...
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురజనాపల్లిలో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వృద్ధురాలు తాతపూడి వెంకాయమ్మ భర్తకు పింఛన్ వచ్చేదని, ఆయన మరణించి ఆరు నెలలైనా తనకు వితంతు పింఛన్ రావడంలేదంటూ వాపోయింది. హౌసింగ్‌లోన్ కోసం నాయకులు దగ్గరకు వెళ్తే మీరు ఎవరికి ఓట్లు వేశారో వారినే అడగండంటూ ఈసడించుకుంటున్నారని మల్లమ్మ వాపోయింది. ఉపాధి హామీ పథకంలో కొంతమందికే పనులు చెబుతున్నారని, పార్టీ పేరుతో వివక్ష చూపుతున్నారని గ్రామ ప్రజలు బాధను వ్యక్తం చేశారు.
స్థానిక ఎమ్మెల్యే ఎక్కడండీ...
పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లిలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు నిర్వహించారు. డ్వాక్రా రుణాలు, గృహాలు మంజూరు కావడంలేదని, స్థానిక ఎమ్మెల్యే తన సమస్యలను పట్టించుకోవడలేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం పాసర్లపూడిలో కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండకుదిటి మోహన్ నిర్వహించారు. సమస్యలను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ స్థానికులు పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. మండపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి ఆధ్వర్యంలో 11,8 వార్డులలో నిర్వహించారు.
పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ(రాజబాబు), పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, జడ్పీటీసీ సభ్యురాలు చిన్నం అపర్ణాదేవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తీన్‌మార్ నృత్యాలు, మహిళ మంగళహారతులతో కోలాహాలంగా సాగింది. రాజమహేంద్రవరంరూరల్ నియోజకవర్గం రాయుడుపాకలు గ్రామంలో కో-ఆర్డినేటర్ గిరిజాల వీర్రాజు(బాబు) ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి దాసరి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో కో-ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ గడపడపకు వైఎస్‌ఆర్‌సీపీ నిర్వహించారు.
అలరిస్తున్న ప్రజా బ్యాలెట్...
అమలాపురం రూరల్ భట్నవిల్లిలో గడపగడపకు వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాన్ని పార్టీ సీఈసీ సభ్యుడు, కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పార్టీ రూపొందించిన ప్రజాబ్యాలెట్‌ను ప్రజలకు అందించి టి.డి.పి. సర్కార్ వైఫల్యాలను వివరించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమస్యలను స్థానికులు విశ్వరూప్, చిట్టబ్బాయి తీసుకొచ్చారు.
జన్మభూమిని అడ్డుకోండి...
అనపర్తి నియోజకవర్గం శహపురం గ్రామంలో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నిర్వహించారు. పింఛన్ కోసం ఏడాదిగా తిరుగుతున్నా జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడుతున్నారంటూ చిన్నారనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. లక్షా 20 వేలు రుణానికిగాను కేవలం రూ.2వేలు మాత్రమే రుణ బకాయి ప్రభుత్వం చెల్లించిందని రాయుడు గోవిందు అనే రైతులు నేతల దృష్టికి తీసుకొచ్చాడు.
అడుగడుగునా సమస్యల స్వాగతం
Published Thu, Jul 14 2016 12:31 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
Advertisement