మృత్యుపంజా విసురుతున్న మద్యం మత్తు
జాతీయ రహదారిపై తరచుగా ప్రమాదాలు
దుర్మరణంపాలవుతున్న వ్యసనపరులు, అమాయకులు
అయినా రోడ్డుకు ఇరువైపులా మద్యం దుకాణాలు
పట్టించుకోని అధికారులు
నెలకోసారి మొక్కుబడిగా తనిఖీలు
అమలుకాని సుప్రీంకోర్టు కమిటీ సూచనలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/జగ్గంపేట :జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా ఉన్న మద్యం దుకాణాలన్నీ తక్షణం తొలగించాలి. వంద మీటర్లలోపు మద్యం దుకాణం అనేదే ఉండకూడదు. - రహదారుల భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీ సరిగ్గా నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన సూచన ఇది.జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఆ కమిటీ పలు సూచనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణా శాఖ కమిషనర్‌లకు లేఖ పంపింది.అయినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికార యంత్రాంగం నిర్లిప్తతతో ఈ సూచన అమలుకు నోచుకోవడంలేదు. ఫలితంగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పలువురు దుర్మరణం పాలవడంతోపాటు.. అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. విజయవాడ సమీపంలో గొల్లవిల్లివద్ద జరిగిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఇదే అంశాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. అమలాపురంలో జరిగిన క్రీడాపోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని తిరిగి వెళ్తున్న ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు ఐదుగురు.. ఈ ప్రమాదంలో దుర్మరణంపాలయ్యారు. డ్రైవర్ మద్యం తాగి ఆ బస్సును నడపడమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో జాతీయ రహదారి పక్కన మద్యం దుకాణాలను అనుమతించడంపై మరోసారి చర్చ మొదలైంది.
జిల్లాలోనూ ఎన్నో ప్రమాదాలు
జాతీయ రహదారిపై జిల్లాలో కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 13న గండేపల్లివద్ద 16 మంది ప్రాణాలు బలిగొన్న లారీ ప్రమాదానికి డ్రైవర్ మద్యం మత్తు కారణమన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. తరువాత కూడా జిల్లాలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వీటికి ప్రధాన కారణం మద్యం మహమ్మారే! జిల్లాలో జాతీయ రహదారి వెంబడి పదికి పైగా మద్యం దుకాణాలున్నాయి. దాబాలు, పాన్ దుకాణాల్లో బెల్ట్‌షాపులు అంతకు పది రెట్లు అధికంగా ఉన్నాయి. ఈ విషయం తెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు పోలీసులు అప్పుడప్పుడు బ్రీత్ ఎనలైజర్‌తో రంగంలోకి దిగుతూంటారు. కానీ దీనివల్ల ప్రయోజనం కనిపించడంలేదు. ఎక్కడైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప శాశ్వత పరిష్కారంవైపు దృష్టి సారించడంలేదు.
మత్తు.. పైగా మితిమీరిన వేగం
జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నాలుగు లేన్లుగా ఉన్న ఈ రహదారిపై వాహనదారులు గంటకు 100 కిలోమీటర్లు పైగా వేగంతో నడుపుతూండడం ప్రమాదాలకు హేతువుగా మారుతోంది. ఈ రహదారిపై ప్రతి రోజూ వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇతర రాష్ట్రాల వాహనాలు కూడా ఉండడం.. సుదీర్ఘ ప్రయాణం కావడంతో.. బడలిక నుంచి బయటపడటానికి ఎక్కువమంది డ్రైవర్లు మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా మద్యం అందుబాటులో ఉంటోంది. మద్యం మత్తులో వేగంగా వాహనం నడిపినప్పుడు.. ఏమాత్రం మత్తులోకి జారినా పెను ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
మొక్కుబడిగా విధులు
మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కేసులు పెట్టే అవకాశం ఉన్నా పోలీసులు, రవాణా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వారు మొక్కుబడిగా విధులు నిర్వహించడం తమ ప్రాణాలపైకి తెస్తోందని పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో డ్రైవర్లను తనిఖీ చేసినప్పుడు 30 ఎంజీకి మించి రీడింగ్ నమోదైతే.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్నారని పేర్కొంటూ, మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185 కింద పోలీసులు కేసు నమోదు చేయొచ్చు. అయితే వేలాది వాహనాల డ్రైవర్లను తనిఖీ చేయడానికి అవసరమైనన్ని బ్రీత్ ఎనలైజర్లు అందుబాటులో లేవు. గతంలో ఇచ్చినవాటిలో చాలావరకూ మూలకు చేరాయి. దీంతో జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు మొక్కుబడిగానే సాగుతోంది. జిల్లాలో హైవేను ఆనుకుని పలు పోలీసు స్టేషన్లు ఉన్నప్పటికీ తనిఖీలు పెద్దగా ఉండడంలేదు. నిరంతరం తనిఖీలు నిర్వహించేలా ప్రతి 5 కిలోమీటర్లకో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తే మందుబాబులైన డ్రైవర్లను అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంటుందనే ప్రతిపాదనలు ఉన్నాయి. వీటితోపాటు, సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన సూచనలను తు.చ. తప్పకుండా పాటిస్తే మద్యం మత్తులో జరిగే ప్రమాదాలను చాలావరకూ తగ్గించవచ్చు.
కన్ను మూస్తున్నా..కళ్లు తెరవరా..?
Published Wed, Mar 16 2016 12:53 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement
Advertisement