చెడ్డోడైనా ఆయనే మంచోడు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరు. దీంతో ఆయన పేషీలో చేరేందుకు ఏ అధికారి, సిబ్బంది కూడా ముందుకు రావటం లేదు. ఒకవేళ ఎవరైనా చేరినా వారం పది రోజుల్లోనే చెక్కేస్తున్నారు. ఏపీ మంత్రివర్గంలో కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి ఒకరికి విపరీతమైన ప్రచార కాంక్ష ఉంది. తాను ఎక్కడ ఎపుడు విలేకరులతో మాట్లాడినా, సమీక్షా సమావే శాలు నిర్వహించినా క్షణాల్లో టీవీ చానళ్లలో బ్రేకింగ్ న్యూస్, తాజా కబుర్ల రూపంలో రావాలని కోరుకుంటారు. అదే సమయంలో తాను మాట్లాడిన వివరాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు కూడా తక్షణం టేబుల్ మీద ఉండాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు.
గతంలో ఈయన పేషీ సిబ్బంది ఒకరు ఆ మంత్రి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా పనిచేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కాబట్టి మంత్రి గారు ఏం చేసినా పేషీ సిబ్బంది అందచేసిన సమాచారం మేరకు క్షణాల్లో టీవీల్లో తాజా కబురు, బ్రేకింగ్ న్యూస్ అంటూ వచ్చేది. దీంతో ఇదంతా తన పేషీ సిబ్బంది గొప్పతనమని భావించిన మంత్రి గారు తెగ సంతోషపడ్డారు. మంత్రిగారి సంతోషానికి కారణమైన సిబ్బందిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావటంతో ఆయనే స్వయంగా నీవు నాకు పనికి రావు పో అంటూ తొలగించేశారు. ఇటీవలి కాలంలో మంత్రి గారు నిర్వహిస్తున్న శాఖ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనటంతో టీవీ చానళ్లు, పత్రికలు కూడా ఆయన్ను లైట్‌గా తీసుకోవటం ప్రారంభించాయి. దీంతో తనకు తగినంత ప్రచారం రాకపోవటంతో మంత్రిగారు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. తనకు ప్రచారం కోసం నియమించుకున్న ఒకరిద్దరు సిబ్బంది ఆశించిన మేరకు పనిచేయకపోవటం వల్లే ఇలా జరుగుతోందని అగ్గిమీద గుగ్గిలం అవుతున్న సదరు మంత్రి గారు చెడ్డోడైనా ఆయనే మంచోడు, నాకు బాగా ప్రచారం కల్పించారు అని ప్రతి ఒక్కరివద్దా చెప్తున్నారు.