ఏలూరు (సెంట్రల్) : గోదావరి పుష్కరాల 12రోజుల్లో జిల్లాలో 96 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 43 మంది పుష్కర యాత్రికులు మరణించారు. 165 మంది యాత్రికులు గాయపడ్డారు. ఈనెల 14న ప్రారంభమైన గోదావరి పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి కోటిన్నరు పైగా జనం జిల్లాకు వచ్చారు. వారు ప్రయాణించిన 96 వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురికాగా, 35 ప్రమాదాల్లో 43 మంది మరణించాడు. అన్ని ప్రమాదాల్లో 165 మందికి గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై 27 ప్రమాదాలు జరగ్గా, ఇతర రోడ్లపై 69 ప్రమాదాలు నమోదయ్యూయి. సెలవు రోజులైన ఈ నెల 18, 19 తేదీల్లోను, పుష్కరాల చివరి రోజులైన 24, 25 తేదీల్లో ఎక్కువ ప్రమాదాలు సంభవించాయి. ఇందుకు గల కారణాలపై పోలీస్ శాఖ సమీక్షిస్తోంది. ఎక్కువ ప్రమాదాలు వేకువజాము 3నుంచి ఉదయం 6 గంటల మధ్యలో జరిగాయి.
కార్లు, బైక్‌ల ప్రమాదాలే ఎక్కువ
ఈ ప్రమాదాలకు గురైన వారిలో కార్లు, మోటారు సైకిళ్లపై వెళుతున్న వారే ఎక్కువ ఉన్నారు. పోలీసులు లెక్క ప్రకారం బైక్ ప్రమాదాలు 21 కాగా, కారుల్లో వెళుతూ ప్రమాదం బారిన పడినవి 26 కేసులు ఉన్నారుు.
ఘోర ప్రమాదాలివీ
ఈనెల 15న భీమడోలు మండలం సాయన్నపాలెంకు చెందిన గొలుగూరి హరినారాయణరెడ్డి తన కుటుంబసభ్యులతో కలసి బైక్‌పై పుష్కర సాన్నానికి వెళుతుండగా అనంతపల్లి ఎర్రకాలువ వద్ద వెనుక నుంచిఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో హరినారాయణరెడ్డి(32), అతని కుమారుడు శ్యాంమనోజ్ రెడ్డి(16 నెలలు) అక్కడిక్కడే మృతిచెందారు.
ఈనెల 20న రాజమండ్రికి చెందిన వైరాల తరుణ్ కుమార్ (20), దిగమర్తి ప్రేమకుమార్(17) రాజమండ్రి నుంచి కొవ్వురు వస్తుండగా వెనుక నుండి కారు ఢీకొనడంతో ఇద్దరూ మరణించారు. ఈనెల 23 పుష్కర స్నానాలకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా తాడేపల్లిగూడెం ఆటోనగర్ సమీపంలోని బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్న ప్రమాదంలో పుల్లెల భూషారావు(40), బుడావల రామకృష్ణ(42), కొఠారి పుట్టయ్య(65) అక్కడిక్కడే మృతిచెందారు.
ఈనెల 24న విజయవాడకు చెందిన నాలుగురు యాత్రికులు పుష్కర స్నానాలు ముగించుకుని తిరిగి వెళుతుండగా, తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఉన్న తాడిచెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో వీఎస్‌ఎస్‌కేహెచ్ ప్రసాద్(36), ఎన్‌వీఎస్ ప్రసాద్(30), పామర్తి పాపారావు(60) మృతి చెందారు. ఈ ప్రమాదానికి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రపోవటమే అని భావిస్తున్నారు.
ఉండి శివారులోని పదెకరాల తూము వద్ద పుష్కర స్నానాలు ముగించుకుని ఆటోలో తిరిగి ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి మినీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో లంకా సత్తిబాబు(35), కాగిత జ్యోతిష్‌బాబు(6) మృతిచెందారు. దొమ్మేరు వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న టాటా మ్యాజిక్ వ్యాన్‌ను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిత్తూరు జిల్లా ఐరాల మండలం పాటూరుకు చెందిన దొండపాటి నందిని (7) అక్కడిక్కడే మృతిచెందింది.