
‘బాబు’ ప్రచారానికి భక్తులు బలి
♦ అవగాహన లేని మంత్రి నారాయణకు పుష్కర పనుల బాధ్యతలా?
♦ బాధ్యులైన మంత్రులను బర్తరఫ్ చేయాలి
♦ నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్
నెల్లూరు (సెంట్రల్) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి పుష్కరాలకు వచ్చిన సామాన్య భక్తులు బలి కావాల్సి వచ్చిందని నగర ఎమ్మెల్యే పి. అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. బాబు లఘు చిత్రం కోసం వీఐపీ ఘాటు వదిలి పుష్కర ఘాట్‌లోకి రావడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మె ల్యే అనిల్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పదే పదే ప్రతిపక్ష నాయకులు చెపుతున్నా పట్టించుకోలేని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం సంబంధిత దేవాదాయ శాఖ మంత్రిని విస్మరించి బాబే స్వయంగా పనులు చూశారన్నారు. కనీస అవగాహన లేని మంత్రి నారాయణకు పుష్కర పనులు అప్పగించారన్నారు. నారాయణ మం త్రి కాదని చంద్రబాబుకు అకౌంటెంటు గా పని చేస్తున్నాడని విమర్శించారు.
మంత్రులపై చర్యలు తీసుకోవాలి
గోదావరి పుష్కర ఘటనకు సంబంధించి చంద్రబాబు కమిటీ వేసి కొంద రు అధికారులను బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అధికారులపై నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. బాధ్యత తీసుకున్న మంత్రులందరూ ఇక్కడ ఏర్పాట్లు వదిలి విదేశాల్లో పర్యటించారని విమర్శించారు. బాధ్యులైన మంత్రులను బర్తరఫ్ చేయాలన్నారు. సమావేశంలో డిఫ్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, జిల్లా యువజన అధ్యక్షుడు పి రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు ఊటుకూరు మాధవయ్య, ఓబిలి రవిచంద్ర, గోగుల నాగరాజు, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మునీర్‌సిద్ధిక్, నాయకులు వేలూరు మహేష్, వందవాసి రంగ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.