రుణం.. తప్పని రణం
► అర్హులను కనికరించని కార్పొరేషన్లు
► లబ్ధిదారుల సొమ్ము కాజేస్తున్న దళారులు
► పట్టించుకోని యంత్రాంగం
వివిధ కార్పొరేషన్‌ల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి ఇది. అన్ని అర్హతలున్నప్పటికీ జన్మభూమి కమిటీ ఎంపిక చేస్తేనే అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ తతంగం ముగిశాక కూడా బ్యాంకర్లు మడతపేచీ పెడుతున్నారు. సెక్యూరిటీ ఇవ్వాలని కచ్చితంగా చెబుతున్నారు. నిబంధనల మేరకు సెక్యూరిటీ అవసరం లేదని గట్టిగా నిలదీస్తే.. సాకులు చెప్పి రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. దీంతో రుణాల మంజూరు కోసం అభ్యర్థులు పెద్ద రణమే చేయూల్సి వస్తోంది.
► నేను కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణం కోసం దరఖాస్తుచేసుకున్నాను. జన్మభూమి కమిటీ అంగీకరించడంతో సబ్సిడీ కూడా మంజూరైంది. అయితే బ్యాంకర్లు లోన్ ఇవ్వమంటే అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. గట్టిగా అడిగితే ష్యూరిటీకావాలంటున్నారు. మాలాంటి వారికి ష్యూరిటీ ఎవరిస్తారు. - ధర్మవరంలోని చీరల వ్యాపారి సతీష్ రాయుడు ఆవేదన ఇది.
► వాల్మీకి ఫెడరేషన్ ద్వారారుణానికి దరఖాస్తు చేసుకున్నాం. అయితే జన్మభూమి కమిటీ ఒప్పుకోలేదని మాఅప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది. ఏం చేస్తాం.. అన్ని అర్హతలున్నా రుణం రాకుండా పోయింది.- కిరాణా దుకాణం నిర్వాహకుడు రామాంజనేయులు ఆక్రందన ఇది.
ధర్మవరం: అధికారులు, అధికార పార్టీ నేతల వివక్ష పేదలకు శాపంలా మారుతోంది. సంక్షేమ పథకాలతో అర్హులందరికీ అందేలా చూడాల్సిన వారే.. ప్రజలకు పొట్టగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల రుణాలు మంజూరు పడకేసింది. అర్హులందరికీ పథకాలు అందేలా చూడాల్సినఅధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
కొందరికే సిఫార్సు
జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, క్రిస్టియన్ కార్పొరేషన్‌లు, దోభీ, నాయిబ్రాహ్మణ,వాల్మీకి, విశ్వబ్రాహ్మణ, కుమ్మర, మేదర, పూసల తదితర సొసైటీల ద్వారా మొత్తం 79,992 మంది ఆన్‌లైన్‌లో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏడుగురితో కూడిన జన్మభూమి కమిటీ దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక్కడ కొంత మందికే కమిటీ సిఫార్సు చేయడంతో దాదాపు 80 శాతం మంది దరఖాస్తులు పరిశీలనలోనే వెనక్కి పడిపోయాయి. మిగిలిన 20 శాతం దరఖాస్తులు ఆపసోపాలు పడి, కార్పొరేషన్లుకు చేరాయి. ఆయా కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తుదారులకు జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాల్సి ఉంది. అయితే బ్యాంకర్లు పూచీకత్తు లేనిది రుణాలు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు.
దళారుల దందా
మరికొన్ని చోట్ల కార్పొరేషన్ అధికారులతో ఉన్న సంబంధాలు, బ్యాంకుల్లో ఉన్న కొందరు ఉద్యోగులతో పరిచయాలతో దళారులు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. అటు అధికారులు, ఇటు బ్యాంకర్ల పేర్లు చెప్పి సొమ్ము చేసుకుంటున్నారు. వచ్చిన రాయితీలో వీరు వాటాలు వేసుకుంటున్నారు. లబ్ధిదారునికి వచ్చిన సొమ్ములో సగం వీరి చేతుల్లోకి చేరుతోంది.
బ్యాంకర్లు ఇంటర్వ్యూలు జరిపి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నా, రుణాలు మంజూరు చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సదరు బ్యాంకు బ్యాంకర్లతో మాట్లాడి ఒప్పించి రుణాలు ఇప్పించి దరఖాస్తు దారులను ఆర్థికంగాఎదిగేందుకు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.