ఏయూ క్యాంపస్: ప్రశ్నపత్రాల లీకుల జాఢ్యం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మరోమారు ఉలికిపాటుకు గురి చేసింది. బుధవారం జరిగిన ద్వితీయ సంవత్సరం డిగ్రీ కెమిస్ట్రీ ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వచ్చింది. వాట్పాప్ ద్వారా పలువురికి చేరిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వర్సిటీ అధికారులు పరీక్షను రద్దు చేసి, నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ప్రాధమికంగా నర్సీపట్నం ప్రాంతంలోని ఒక ప్రైవేటు కళాశాలలో పశ్నపత్రం లీకైనట్లు అధికారులకు సమాచారం అందింది.
లీక్ ధ్రువీకరణ
మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మొబైల్‌కు వాట్పాస్ ద్వారా ప్రశ్నాపత్రం వచ్చింది. వెంటనే ఆయన కాన్ఫిడెన్షియల్ విభాగం నుంచి అసలు ప్రశ్నపత్రం తెప్పించి సంబంధిత అధికారుల సమక్షంలో రెండింటినీ పరిశీలించారు. రెండింటిలోనూ ప్రశ్నలు ఒకేలా ఉండటంతో ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఖరారు చేసుకున్నారు. నర్సీపట్నం ప్రాంతంలోని ఒక కళాశాలలో ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ప్రాథమిక సమాచారంతో యూజీ పరీక్షల డీన్ ఆచార్య సుదర్శనరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లను వెంటనే నర్సీపట్నం పంపారు. ఇదంతా జరిగేసరికి సాయంత్రం 4 గంటలు అయ్యింది.
పేపర్ లీక్ అయ్యిందనే విషయం కళాశాలలకు తెలియకపోవడంతో యథావిధిగా పరీక్ష బుధవారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగింది. దాంతో బుధవారం జరిగిన కెమిస్ట్రీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి కారణమైన కళాశాలను గుర్తిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లో స్పెషల్ అబ్జర్వర్స్‌ను వేయడంతోపాటు అవసరమైచోట పరీక్ష కేంద్రాలను మారుస్తామన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి కారణమైన కళాశాలను గుర్తించి.. అక్కడి కేంద్రాన్ని రద్దు చేస్తామన్నారు. విచారణ జరిపి అవసరమైతే కళాశాల గుర్తింపును సైతం రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మరికొన్ని పేపర్లు లీక్ అయ్యాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతామన్నారు.
లీకులను ఆపలేరా?
గత సంవత్సరం ఇదే విధంగా నగరంలోని బుద్ద రమేష్ బాబు డిగ్రీ కళాశాలలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. అధికారులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకుని లీక్ అయిన విషయాన్ని గుర్తించారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. వర్సిటీ అధికారులు పరీక్ష కేంద్రానికి చేరుకునే సమయానికే పరీక్ష ప్రారంభం అయిపోతుంది. దాంతో సీల్డ్ కవర్‌ను ముందుగా ఓపెన్ చేశారా లేదా అనే విషయం తెలిసే అవకాశం లేదు.
దోషులు దొరుకుతారా అనే విషయం తెలియడం లేదు. అంతకు ముందు సంవత్సం వర్సిటీ ఉద్యోగి ఒకరు తన మిత్రుడి కుమార్తె కోసం ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రాలను ముందుగానే బయటకు తెచ్చారు. అతన్ని కంటి తుడుపు చర్యలతో వదిలిపెట్టేశారు. ఫలితంగా వర్సిటీలో ప్రశ్నాపత్రాల లీకేజీ సర్వసాధారణ విషయమనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద, పురాతన వర్సిటీ అయిన ఏయూకు ప్రశ్నాపత్రాల లీకేజీ పెద్ద సమస్యగా మారుతోంది. సుదీర్ఘ అనుభవం కలిగిన పరీక్షల విభాగం లీకులను అరికట్ట లేకపోవడానికి కారణాలు తెలియడంలేదు. అనుభవజ్ఞులైన సిబ్బంది, అధునాతన సాంకేతిక వనరులు ఉన్నప్పటికీ లీకులను అరికట్టలేకపోవడం వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది.
కఠిన చర్యలతోనే అడ్డుకట్ట
వర్సిటీ ఉదాసీన వైఖరి ఇటువంటి వాటికి ఆస్కారం కల్పిస్తోంది. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినపుడు కఠిన చర్యలు తీసుకొని ఉంటే అవి పునరావృతమయ్యేవి కావు. అధికారులు కొరడా ఝుళిపించకపోవడం అక్రమార్కులకు అవకాశంగా మారుతోంది. కళాశాలల నుంచి వచ్చే ఒత్తిడి సైతం అధికారులను చర్యలు తీసుకోనివ్వకుండా అడ్డుకుంటోందనే వాదన వినిపిస్తోంది. వర్సిటీ అధకారులు ప్రత్యేక దృష్టిసారించి పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.
వాట్సాప్‌లో ప్రశ్నపత్రం
Published Wed, Apr 20 2016 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement
Advertisement