vatsap
-
వాట్సాప్‌లో ప్రశ్నపత్రం
ఏయూ క్యాంపస్: ప్రశ్నపత్రాల లీకుల జాఢ్యం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మరోమారు ఉలికిపాటుకు గురి చేసింది. బుధవారం జరిగిన ద్వితీయ సంవత్సరం డిగ్రీ కెమిస్ట్రీ ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వచ్చింది. వాట్పాప్ ద్వారా పలువురికి చేరిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వర్సిటీ అధికారులు పరీక్షను రద్దు చేసి, నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ప్రాధమికంగా నర్సీపట్నం ప్రాంతంలోని ఒక ప్రైవేటు కళాశాలలో పశ్నపత్రం లీకైనట్లు అధికారులకు సమాచారం అందింది. లీక్ ధ్రువీకరణ మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మొబైల్‌కు వాట్పాస్ ద్వారా ప్రశ్నాపత్రం వచ్చింది. వెంటనే ఆయన కాన్ఫిడెన్షియల్ విభాగం నుంచి అసలు ప్రశ్నపత్రం తెప్పించి సంబంధిత అధికారుల సమక్షంలో రెండింటినీ పరిశీలించారు. రెండింటిలోనూ ప్రశ్నలు ఒకేలా ఉండటంతో ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఖరారు చేసుకున్నారు. నర్సీపట్నం ప్రాంతంలోని ఒక కళాశాలలో ప్రశ్నాపత్రం లీక్ అయిందనే ప్రాథమిక సమాచారంతో యూజీ పరీక్షల డీన్ ఆచార్య సుదర్శనరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లను వెంటనే నర్సీపట్నం పంపారు. ఇదంతా జరిగేసరికి సాయంత్రం 4 గంటలు అయ్యింది. పేపర్ లీక్ అయ్యిందనే విషయం కళాశాలలకు తెలియకపోవడంతో యథావిధిగా పరీక్ష బుధవారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగింది. దాంతో బుధవారం జరిగిన కెమిస్ట్రీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి కారణమైన కళాశాలను గుర్తిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లో స్పెషల్ అబ్జర్వర్స్ను వేయడంతోపాటు అవసరమైచోట పరీక్ష కేంద్రాలను మారుస్తామన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి కారణమైన కళాశాలను గుర్తించి.. అక్కడి కేంద్రాన్ని రద్దు చేస్తామన్నారు. విచారణ జరిపి అవసరమైతే కళాశాల గుర్తింపును సైతం రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మరికొన్ని పేపర్లు లీక్ అయ్యాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతామన్నారు. లీకులను ఆపలేరా? గత సంవత్సరం ఇదే విధంగా నగరంలోని బుద్ద రమేష్ బాబు డిగ్రీ కళాశాలలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. అధికారులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకుని లీక్ అయిన విషయాన్ని గుర్తించారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. వర్సిటీ అధికారులు పరీక్ష కేంద్రానికి చేరుకునే సమయానికే పరీక్ష ప్రారంభం అయిపోతుంది. దాంతో సీల్డ్ కవర్‌ను ముందుగా ఓపెన్ చేశారా లేదా అనే విషయం తెలిసే అవకాశం లేదు. దోషులు దొరుకుతారా అనే విషయం తెలియడం లేదు. అంతకు ముందు సంవత్సం వర్సిటీ ఉద్యోగి ఒకరు తన మిత్రుడి కుమార్తె కోసం ఇంజనీరింగ్ ప్రశ్నాపత్రాలను ముందుగానే బయటకు తెచ్చారు. అతన్ని కంటి తుడుపు చర్యలతో వదిలిపెట్టేశారు. ఫలితంగా వర్సిటీలో ప్రశ్నాపత్రాల లీకేజీ సర్వసాధారణ విషయమనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద, పురాతన వర్సిటీ అయిన ఏయూకు ప్రశ్నాపత్రాల లీకేజీ పెద్ద సమస్యగా మారుతోంది. సుదీర్ఘ అనుభవం కలిగిన పరీక్షల విభాగం లీకులను అరికట్ట లేకపోవడానికి కారణాలు తెలియడంలేదు. అనుభవజ్ఞులైన సిబ్బంది, అధునాతన సాంకేతిక వనరులు ఉన్నప్పటికీ లీకులను అరికట్టలేకపోవడం వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. కఠిన చర్యలతోనే అడ్డుకట్ట వర్సిటీ ఉదాసీన వైఖరి ఇటువంటి వాటికి ఆస్కారం కల్పిస్తోంది. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినపుడు కఠిన చర్యలు తీసుకొని ఉంటే అవి పునరావృతమయ్యేవి కావు. అధికారులు కొరడా ఝుళిపించకపోవడం అక్రమార్కులకు అవకాశంగా మారుతోంది. కళాశాలల నుంచి వచ్చే ఒత్తిడి సైతం అధికారులను చర్యలు తీసుకోనివ్వకుండా అడ్డుకుంటోందనే వాదన వినిపిస్తోంది. వర్సిటీ అధకారులు ప్రత్యేక దృష్టిసారించి పరీక్షల విభాగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. -
స్వీ T- షర్ట్స్
సెల్ఫీస్ ఎక్కడుంటాయి? ఫేస్బుక్, వాట్సప్ ఆర్ ట్విట్టర్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతిబింబిస్తుంటాయి! అనుకున్నారంటే... మీరు ఫ్యాషన్‌లో అప్డేట్ కానట్టే. ఎందుకంటే... ఇప్పుడు సెల్ఫీస్ అండ్ హాష్‌ట్యాగ్స్ వార్డ్‌రోబ్‌లోకి చేరిపోయాయి. సోషల్ నెట్‌వర్క్స్‌లోని ఈ ట్రెండ్‌ని క్యాప్చర్ చేసి అవుట్‌ఫిట్‌గా మార్చి... అతివల ఒంటి మీదకు చేర్చారు డిజైనర్స్. సెలబ్రిటీస్నుంచి కాలేజ్ గాళ్స్వరకు ఇష్టపడుతున్న సెల్ఫీ స్వీట్షర్ట్స్ ప్రస్తుతం ట్రెండ్! కాదేదీ కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ... కానీ కాదేదీ ఫ్యాషన్‌కు అనర్హం అని పునర్ నిర్వచనమిస్తున్నారు డిజైనర్స్. యూత్‌ను అట్రాక్ట్ చేసే ఏదైనా సరే అవుట్ఫిట్స్లోకి చేర్చడం అందరికీ తెలిసిందే. సెల్ఫీస్ ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్‌లో ట్రెండ్. దాన్ని టీ షర్ట్స్ మీద ఫోకస్ చేసి మార్కెట్లోకి తెచ్చారు. మీరు సెల్ఫీస్ ఇష్టపడ్డా లేదంటే వాటిని అసహ్యంచుకున్నా... అభిప్రాయం ఏదైనా షర్ట్‌మీద వ్యక్తపరచొచ్చు. స్టైల్ స్టేట్మెంట్... ఈ స్వీట్ షర్ట్స్ స్టైలిష్ మాత్రమే కాదు... లగ్జరీయస్ కూడా! వీటిని మీరు ఫ్లెయిర్ స్కర్ట్, ట్రౌజర్స్ లేదా ఫార్మల్ ట్రౌజర్స్, జీన్స్, కట్ ఆఫ్ షార్ట్స్పైకి మ్యాచింగ్ వేసుకోవచ్చు. ఈవెనింగ్ ఔటింగ్స్‌కి, కాక్టెయిల్ పార్టీస్‌కి, ఫ్రెండ్స్తోసినిమాలు, లంచ్ లేదా షాపింగ్ అకేషన్ ఏదైనా, ఏ లొకేషన్కయినా పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్! అయితే ఆ టాప్ అండ్ బాటమ్ కాంట్రాస్ట్ కలర్స్ అయితే.. మీరు గ్రాండ్‌గా కనబడతారు. న్యూ స్టైల్‌కి స్టేట్మెంట్లాగా మారిపోతారు! -
హైదరాబాద్ ఫుల్ హ్యాపీ
‘ఏబీసీడీలు చెప్పు నాన్న’.. ఓ తల్లి తన గారాలపట్టిని ముద్దుగా అడిగింది. ఆ చిచ్చర పిడుగు వెంటనే డాడీ స్మార్ట్ ఫోన్ తెచ్చేసి అందులో ఆల్ఫాబెట్స్ యాప్ ఓపెన్ చేసి ఏ ఫర్ యాప్.. అని మొదలెట్టేసింది. స్మార్ట్ ఫోన్ల జమనాలో మాటలాడుకోవడానికి వాట్సప్.. పాటలాడుకోవడానికి రాగా, గానా యాప్‌లు.. యాప్ యాప్ హుర్రే అంటున్నాయి. ‘కాసేపు బయటకెళ్లి ఫ్రెండ్స్‌తో ఆడుకోండి’.. అని పేరెంట్స్ బంపర్ ఆఫర్ ఇచ్చినా.. ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుని లెట్స్ ప్లే అంటున్నారు పిల్లలు. పెద్దలు కూడా ప్రతి పనినీ ‘యాపీ’గా ఫోన్లోనే కానిచ్చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌తో దోస్తీలోనే కాదు.. యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడంలోనూ హైదరాబాదీలు రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. యాప్‌ల వినియోగంలో ఇంతకుముందు ఢిల్లీ, బెంగళూరు లాంటి మెట్రో నగరాలు ముందుండగా వాటిని వెనక్కి నెట్టి ఇప్పుడు హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్‌ను కొట్టేసింది. ..:: - కట్ట కవిత యాప్ మానియాలో హైదరాబాదీలు మునిగితేలుతున్నారు. బస్సు రూట్ తెలుసుకోవడానికి ‘హైదరాబాద్’ ఆర్టీసీ ఇన్ఫో, ఏదైనా ఆపద వచ్చినప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేయడానికి ‘హాక్ ఐ హైదరాబాద్ పోలీస్’ లాంటివి కొన్నుంటే.. కమ్యూనికేషన్ యాప్స్ మరికొన్ని, కాల క్షేపానికి వాడే ఈ కామర్స్, ట్రావెలింగ్, గేమింగ్ యాప్స్ ఇంకొన్ని ఉన్నాయి. దీన్ని బట్టి నగరవాసులు ఈ కామర్స్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్న వారిలో ఇరవై మూడు శాతం మంది ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. అంటే లార్జ్ స్క్రీన్స్ డివైస్‌లను ఉపయోగించేందుకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్, లార్జ్ స్క్రీన్ ఫోన్స్ ఉపయోగించేవాళ్లలో విద్యార్థులు, ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటున్నారు. ఇక షాపింగ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవడంలో మాత్రం బెంగళూరే ప్రథమ స్థానంలో ఉంది. ట్రావెల్ అప్లికేషన్స్ డౌన్‌లోడింగ్‌లో సిటీ మూడో స్థానంలో ఉంది. ఈ వివరాలన్నీ ఆండ్రాయిడ్ ఫోన్స్ అప్లికేషన్ ‘ప్లాట్‌ఫామ్ ఫ్రీపైసా’ నిర్వహించిన సర్వేలో తేలాయి. త్రీజీ మేడ్ ఈజీ.. ఈ ఏడాది ఇప్పటి వరకు మన దేశం 9 బిలియన్ల అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంది. 2012తో పోల్చుకుంటే ఇది ఐదురెట్లు ఎక్కువ. ఇందులో పెయిడ్ యాప్స్ 1,500 కోట్ల రూపాయల విలువైనవి. ఇక ఫ్రీ యాప్స్ గురించి చెప్పనక్కర్లేదు. త్రీజీ నెట్వర్క్ విస్తరిస్తుండటం, ఈ ఏడాది వస్తున్న ఫోర్జీ నెట్వర్క్ స్మార్ట్ ఫోన్ యూసేజ్‌ను, యాప్స్ డౌన్‌లోడింగ్‌ను మరింత పెంచుతుందని అంచనా. ప్రస్తుతం ఇండియాలో మూడు లక్షల మంది యాప్ డె వలపర్స్ ఉన్నారు. 2017 కల్లా సాఫ్ట్వేర్ డెవలపర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కామర్స్‌దే ఫస్ట్ ప్లేస్... ఐడియా ఉంటే చాలు.. స్టార్టప్ కోసం ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తుండటంతో నగరంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. హైదరాబాదీలు డౌన్లోడ్ చేసుకుంటున్న యాప్స్‌లో ఎక్కువగా ఈ-కామర్స్ యాప్స్ ఉంటున్నాయి. రెండో స్థానం కమ్యూనికేషన్ యాప్స్, మూడో స్థానంలో తెలుగులో భాష అప్లికేషన్స్ ఉన్నాయి. ఆన్లైన్ కేటలాగ్స్తో వెబ్‌సైట్స్ వర్చువల్ మాల్స్‌లా మారిపోయాయి. అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువగా ఆన్లైన్లో జరుగుతున్నాయి. వీటితోపాటు ఇతర బిజినెస్ లావాదేవీలకోసం ఈ-కామర్స్ యాప్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈజీ షేరింగ్, ఫ్రీ అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ కోసం వాట్సప్, టెలిగ్రామ్, హైక్ వంటి కమ్యూనికేషన్ యాప్స్‌ని హైదరాబాదీలు ఎక్కువగా డౌన్లోడ్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఉండే అప్లికేషన్స్‌ని మాత్రం విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు ఎక్కువగా వాడుతున్నారు. - అయ్యప్ప నగుబండి, పాసిబిలియన్ టెక్నాలజీస్ -
శాసిస్తున్న సోషల్ మీడియా..!
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రజలు సోషల్ మీడియాను ఫాలో అవుతూ చైతన్యవంతులవుతున్నారు. ముఖ్యంగా యువత ‘ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, వాట్స్అప్, యూట్యూబ్’ తదితర సామాజిక మీడియాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు చుట్టూ సమాజంలో జరుగుతున్న అంశాలను తెలుసుకుంటున్నారు. అలాగే ఎప్పటికప్పుడు తమకు తెలిసిన సమాచారాన్ని కూడా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ అంశాలను కొందరు లైక్, షేర్ చేస్తూ సరికొత్త విప్లవానికి బాటలు వేస్తున్నారు. ఢిల్లీలో చోటు చేసుకున్న ‘నిర్భయ’ ఘటన దేశాన్ని కదిలించడానికి కేవలం సోషల్ మీడియానే కారణం. కొంతకాలంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను యువత ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలోకి దిగిన కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ సామాజిక మీడియాను ఉపయోగించుకుని అద్భుత ఫలితాలు సాధించింది. అలాగే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా యువత మద్దతు కూడగడుతున్నారు. రాష్ట్రంలో కూడా సామాజిక మీడియా రాజకీయాల్లో తన వంతు పాత్ర పోసిస్తోం ది. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇటీవల కొన్ని రోజుల వ్యవధిలో వైఎస్సార్సీపీ సైట్‌ను ఏడు లక్షల మంది యువత సందర్శించడమే. యువనాయకత్వానికి ప్రాధాన్యమిస్తున్న యువత రోజురోజుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు మద్దతు ఇస్తున్నారు. -
హైటెక్ ప్రచారం
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులతో సమాచార మార్పిడిలోనూ అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కటంతో కూర్చున్నచోటు నుంచే ప్రపంచాన్ని చుట్టివచ్చే అవకాశం వచ్చేసింది. తమ అభిప్రాయాన్ని సెల్ఫోన్లో టైప్‌చేసి వేలి మొన సెల్‌ఫోన్‌ను తాకేలోపే క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోయే పరిస్థితులు వచ్చేశాయి. ఈ పరిజ్ఞానంతో ప్రజల్లోనూ అన్ని రంగాలపై అవగాహన విపరీతంగా పెరిగింది. రాజకీయంగానూ చైతన్యవంతులయ్యారు. తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తపరిచే స్వేచ్ఛ రావటంతో సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఎఫ్బీ, యూట్యూబ్, ట్విట్టర్, వాట్స్అప్, నింబాస్, మెసెంజర్, మైస్పేస్.. ఇలా రకరకాల నెట్బ్రౌజర్లను వాడుతున్నారు. ప్రధాన ప్రచారాస్త్రం సెల్‌ఫోన్ వినియోగదారులు భారీసంఖ్యలో పెరిగిపోవటంతో కంపెనీలు సైతం ఆకర్షణీయ ప్యాకేజీలు అందిస్తున్నాయి. దీంతో సెల్ వినియోగదారులంతా నెటిజన్లుగా మారిపోయారు. ఇక రాజకీయ పార్టీలు సైతం ‘సోషల్ మీడియా’ను ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నాయి. ఆయా పార్టీల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఫేస్బుక్ (ఎఫ్బీ)లో పార్టీల కార్యక్రమాల నుంచి తమ అభిమాన పార్టీలకు మద్దతు తెలుపుతూ నెటిజన్లు హల్చల్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు అధికంగా ట్విట్టర్లో తమ మనోభావాలను పంచుకుంటున్నారు. యూట్యూబ్, వాట్సప్‌లోనూ వీడియోలు పెడుతున్నారు. పార్టీల హల్చల్ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు జోరు పెరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, అభిమానులు పార్టీ కార్యక్రమాలను ఇంటర్నెట్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ ఇద్దరు కలిసినా ఎఫ్బీ, యూట్యూబ్, ట్విట్టర్లో కొత్త లోగో అప్డేట్ అయిన కామెంట్లు, అంశాలపై విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. ఈ కోవలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక పరిస్థితులకు పూర్తిస్థాయిలో అద్దంపట్టేలా సోషల్ మీడియా విస్తరించింది. ప్రజల్లోనూ రాజకీయ చైతన్యం పెరగటంతో సోషల్ మీడియా ఒక ఆయుధంగా మారింది. చదువుకున్న విద్యార్థులు, యువతే కాదు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకూ సోషల్ మీడియా అవగాహన ఉందంటే ప్రజల్లోకి ఎంతలా చేరిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీనిని మునిసిపల్ ఎన్నికల అభ్యర్థులూ పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. -
లోక్‌సభ ఎన్నికలు
దేశభవిష్యత్తు యువత చేతిలో ఉందని వివేకానందుడు చెప్పి న మాటలు అక్షరాల సత్యాలవుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారం యువతలో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తోంది. ఫేస్బుక్, యూట్యూ బ్, ట్విటర్, వాట్సప్.. కాదేది ప్రచారానికి అనర్హం. మూడు షేర్లు, ఆరు కామెంట్లు.. 12 లైక్‌లే యూత్‌లో ఉన్న ఆదరణకు ఆధారం. యువ ఓటరు నాడిని పట్టేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నేటితరం ప్రచార వేదికగా నిలిచిన సామాజిక ప్రసార మాధ్యమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఎప్పుడూ ఆన్లైన్లో ఉండే ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ తరహా రాజకీయ ప్రచారం జాతీయ స్థాయిలో ఉండగా.. ఇప్పుడు మున్సిపల్ స్థాయి ఎన్నికల్లో సైతం సోషల్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న కేజ్రీవాల్, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడి సోషల్‌మీడియా ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. సోషల్ మీడియాలో వీరికి యువతలో ఉన్న క్రేజీ అంతాఇంతా కాదు. దీంతో తాము ఓటు వేయడమే కాదు రాజకీయాల్లోకి వచ్చేందుకు వీలుగా యువత ప్రచారం చేసుకుంటోంది. న్యూఢిల్లీ: అమెరికాలాంటి అగ్ర దేశంలోని ఎన్నికలతోపాటు మనదేశ జాతీయ రాజకీయాల్లోనూ ఇప్పటికే విస్తృతంగా కొనసాగుతున్న సోషల్ మీడి యా ప్రచారం యువతపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. యువతను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతో యువతలో కూడా రాజకీయ చైతన్యం పెరుగుతోందని పరిశీలకులు అంటున్నారు. స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని నేటి యువత సోషల్ నెట్వర్క్ సైట్లను అధికంగా ఉపయోగించుకుంటుండటంతో.. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. సెల్ఫోన్లలో యువత ఎక్కువగా ఉపయోగించే ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, యూ ట్యూబ్, టెలిగ్రాం తదితర అప్లికేషన్ల ద్వారా పబ్లిసిటీ మొదలుపెట్టారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న యువ అభ్యర్థులు ఈ ప్రచారంపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. తమ బయోడేటా మొదలుకొని పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొంటున్న ఫొటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటూ లైక్‌లు, షేరింగ్, కామెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాపై పెద్దగా అవగాహన లేని సీనియర్ అభ్యర్థులు సైతం తమ కుటుంబంలో లేదా తన వర్గానికి చెందిన యువకుల సహకారంతో తమ అకౌంట్స్‌ను నిర్వహిస్తున్నారు. తద్వారా వారు ఓటర్లకు చెప్పాలనుకున్న సమాచారాన్ని అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఫేస్బుక్ యుద్ధాలు.. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే. ఇది పైస్థాయి నేతల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగిస్తున్న పార్టీలు దాని ద్వారా విమర్శలు గుప్పించుకుంటున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతుందని ఒక పార్టీ పోస్టు చేస్తుండగా, మరో పార్టీ వారు తమతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గొప్పగా పోస్టు చేసుకుంటున్నారు. ఆయా పార్టీలకు అభిమానులుగా ఉండే సభ్యులు ఈ పోస్టులకు బాగా స్పందించి లైక్‌లు, కామెంట్లు, షేర్లు చేస్తున్నారు. అయితే పక్క పార్టీలకు చెందిన అభిమానులు ఒక్కోసారి ప్రత్యర్థి పార్టీల పోస్టులపై వ్యంగ్యంగా కామెంట్ చేస్తూ అభిమానులను రెచ్చగొడుతున్నారు. దీంతో ఇరు పార్టీల అభిమానులు కామెంట్లతో గొడవలకు దిగుతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి.. నోటుకు ఓటు అమ్ముకునే వారు కొందరైతే తమకేమొస్తుందని అసలు ఓటు హక్కునే వినియోగించుకోని వారు మరికొందరు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువత సైతం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మన తలరాతను నిర్దేశించే వారిని ఎన్నుకునే ఈ సమరంలో మన అభ్యున్నతికి పాటుపడే యువ నాయకులను గెలిపించుకునే అవకాశాన్ని వదులుకోకుండా ఓటు అనే వజ్రాయుధాన్ని విని యోగించాల్సిన అవసరం ఉంది. యువత నడుం బిగించి ఓటర్లను చైతన్యవంతం చేసి వంద శాతం ఓటు హక్కును వినియోగించుకునేలా చేయాలి. అవినీతి రహిత నవశకానికి పునాది వేయాలి.