ఇల వైకుంఠం తిరుమలలో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే రద్దీకి తగ్గట్టుగా క్యూ నిర్వహణలో టీటీడీ అంత పటిష్టంగా లేదనే చెప్పాలి. దీంతో తరచూ భక్తులకు తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుత క్యూలకు అత్యవసర ద్వారాలు సరిపడా లేవు. ఆదివారం కేరళలోని ఓ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో తిరుమల కొండపై క్రౌడ్ మేనేజ్‌మెంట్ నిర్వహణను టీటీడీ మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం కలిగింది.
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకొండకు వచ్చే భక్తుల కోసం ధార్మిక సంస్థ టీటీడీ విజిలెన్స్, పోలీసు బలగాలు బోలెడంత భద్రతను కల్పిం చాయి. భక్తులు తీర్థయాత్రను పరి పూర్ణం చేసుకునే సౌలభ్యం ఉంది. టీటీడీ ముఖ్య భద్రత, నిఘా అధికారి నేతృత్వంలో స్వామి ఆలయానికి ఆర్మ్‌డ్ ఫోర్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్), టీటీడీ విజిలెన్స్ విభాగాలు పనిచేస్తాయి. మహద్వారం నుంచి ఆనంద నిలయం ప్రాకారం వరకు విజిలెన్స్ తప్ప మిగిలిన సిబ్బంది అధునాతన ఆ యుధాలతో 24 గంటలూ షిఫ్టుల పద్ధతిలో పహారా కాస్తారు. ఇక ఆలయం మీద నాలుగు దిశల్లోనూ గస్తీ (ఔట్‌పోస్టుల్లో) ఉంటుంది. ఆలయం ముందు గొల్ల మండపం వద్ద కూడా అలాంటి వాటిలోనే భద్రత సిబ్బంది విధులు నిర్వర్తింటారు. విధుల్లో ఉన్నవారు తప్ప ఆలయంలోకి ఇతర భద్రతా సిబ్బంది ఆయుధాలు తీసుకెళ్లకూడదు. ప్రొటోకా ల్ వీఐపీలతోపాటు ఆయుధాలతో వచ్చే భద్రతా సిబ్బంది కూడా ఆలయ మహద్వారం దాటి లోనికి వెళ్లకూడదు. స్వా మి దర్శనానికి వెళ్లే భక్తులను భద్రతా సిబ్బంది వైకుంఠం నుంచి ఆలయం వరకు పలు దశల్లో తనిఖీ చేస్తారు. మెట ల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. ఆలయంలోకి లగేజీతో వెళ్లడం నిషిద్ధం. భక్తుల చిన్నపాటి చేతిబాగులు పరిశీలించేందుకు అధునాతన స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. వైకుంఠం నుంచి ఆలయం వరకు అడుగడుగునా అధునాతన సీసీ కెమెరా వ్యవస్థ ఉంది. నిఘా సిబ్బంది క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్లేవారి కదలికల్ని నిశితంగా పరిశీలిస్తారు.
క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో వెనుకబాటు
టీటీడీ లెక్కల ప్రకారం ఏటా సగటున 2 కోట్ల నుంచి 2.5 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అంటే రోజుకు సరాసరిగా 70 వేల మంది వస్తున్నారు. రద్దీ తక్కువగా ఉండేరోజులో కనీసం 40 వేలకు తగ్గదు. సెలవులు, పర్వదినాల్లో ఈ సంఖ్య లక్ష దాటుతోంది. ఈ సమయంలో భక్తుల క్యూల నిర్వహణలో టీటీడీ వైఫల్యం చెందుతోందని చెప్పక తప్పదు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సంబంధిత విభాగాలు ఏకకాలంలోనే ముందుకు రావాలి. అలాంటి వ్యవస్థ శాస్త్రీయంగా టీటీడీలో లేదు. ఇందులో ఆలయం, విజిలెన్స్ విభాగాల్లో ఎవరు ఏ విధులు నిర్వహించాలి? అన్న స్పష్టమైన విధి విధానాల్లేవు. సాధారణ రోజుల్లో క్యూ, రద్దీ రోజుల్లో క్యూ ఎలా నిర్వహించాలి? అన్నది ఆయా విభాగాధిపతి ఆదేశాల మేరకే నడుస్తోంది. అందుకు ప్రస్తుత టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ఉదాహరణగా చెప్పవచ్చు. వారు క్యూ వద్ద ఉంటేనే అన్ని విభాగాల అధికారులు అక్కడ ఉంటారు. వారు ఆయన ముఖం చాటేస్తే ఎవరిపనుల్లో వారు బిజీగా ఉంటారు. దీనివల్ల రద్దీక్యూ నిర్వహణలో ఎలాంటి స్పష్టత రావటం లేదు. ఫలితంగా భక్తుల అవస్థలు వర్ణనాతీతం. భక్తుల మధ్య తోపులాటలు నిత్యకృత్యంగామారాయి.
సెంట్రల్ కమాండెంట్ సెంటర్ పరిస్థితేమిటి?
అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అన్ని విభాగాలను సమన్వయం చేసేందుకు సమష్టిగా పనిచేసి పరిస్థితులను నుంచి గట్టెక్కించేందుకు టీటీడీ ప్రత్యేకంగా సెంట్రల్ కమాండెంట్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇది కేవలం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మాత్రమే పనిచేస్తుంది. ఇందులో టీటీడీలోని విజిలెన్స్, ఇంజినీరింగ్, ఆలయం, అన్నప్రసాదం, ఇతర అవసరమైన అనుబంధ విభాగాలు ఉంటాయి. దీంతోపాటు జాతీయ విపత్తుల నివారణ సంస్థ తరఫున ఓ బృందాన్ని తిరుమలలో నెలకొల్పాలని టీటీడీ నిర్ణయించింది. ఇది ఇంతవరకు అమలు కాలేదు. అలాగే, టీటీడీ విజిలెన్స్ విభాగంలోని కొంతమంది సిబ్బందికి జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఎన్‌డీఆర్‌ఎఫ్ నేతృత్వంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాంటి వారిని ఇతర విధుల్లో వినియోగించుకుంటున్నారు. ఇక కల్యాణకట్టల్లో భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు, గదులు పొందేందుకు భక్తులు బారులు తీరిన క్యూలో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివాటిని కూడా సంబంధిత అధికారులు పరిగణలోకి తీసుకుని క్యూలను సజావుగా సాగే విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది.