రచ్చబండకు రె‘ఢీ’
Published Sun, Nov 10 2013 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్: జిల్లాలో ‘రచ్చబండ’మూడో విడత సోమవారం నుంచి ఈనెల 26 తేదీ వరకు నిర్వహించనున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్ల మంజూరు, ఎస్‌సి,ఎస్‌టి ఇళ్లకు విద్యుత్ బకాయిలు తదితర అంశాలపై రచ్చబండ నిర్వహించనున్నారు. వివిధ సమస్యలపై ప్రభుత్వ నిర్లిప్తతపై రచ్చబండ వేదికగా నిలదీసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అధికారుల్లో కలవరం.. రచ్చబండకు హాజరయ్యేం దుకు ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కలవరపడుతున్నారు. రెండో విడతలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సుమారు రెండేళ్లు తీసుకోవడం, వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని మాత్రమే పరిష్కరించడంతో మిగిలిన వారికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక అధికారులు తలలుపట్టుకుంటున్నారు. జిల్లాలో తుఫానుకు పంట కోల్పోయిన రైతులు సైతం అధికారులను పరిహారం కోసం నిలదీసే అవకాశం ఉంది. జిల్లాలో 56, 838 కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండోవిడతలో వచ్చిన పింఛన్లు, ఇళ్ల మంజూరు లబ్ధిదారులకు అందజేయనున్నారు.
జిల్లాలో 56,838 రేషన్‌కార్డులు పంపిణీ..
జిల్లాలో 56, 838 కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రెండోవిడత రచ్చబండలో వచ్చిన పింఛన్లు ఇళ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేయనున్నారు. నగరంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహించేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమయ్యారు. మొదటి, రెండో విడత వచ్చిన 37,744 రేషన్‌కార్డుల దరఖాస్తులను పరిశీలించిన అధికారులు తూర్పు నియోజకవర్గం పరిధిలో 7,641 , పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 2,997 కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం 1431 దరఖాస్తులు రాగా, వాటిలో 1037 మంజూరు చేశారు. తూర్పులో 1885, పశ్చిమలో 800 మందికి పింఛన్లు మంజూరు చేశారు. ఎస్‌సి గృహాలకు విద్యుత్ బకాయిల కింద రూ.4.98 లక్షలు, ఎస్‌టి ఇళ్లకు విద్యుత్‌బకాయిల కింద రూ.5.15 లక్షలు మంజూరు చేశారు.
కళాజాత ప్రచారం.. కొరిటెపాడు (గుంటూరు): రచ్చబండ సభలకు కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాజాత బృందాలు మండల కేంద్రాలతోపాటు పురపాలక సంఘం, నగర కార్పొరేషన్ పరిధిలో వార్డు సభలకు రచ్చబండ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పథకాల మంజూరు గురించి తెలియజేస్తారని పేర్కొన్నారు. 14 వీధి నాటకాలు, ఐదు బుర్రకథలు, మూడు హరికథ బృందాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో బృందాన్ని కేటాయించినట్లు పేర్కొన్నారు. కళాకారుల బృందం ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్‌కు ఒక రోజు ముందుగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Advertisement
Advertisement