పోలీసుల నీడన రచ్చబండ
Published Thu, Nov 14 2013 1:35 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు :‘రచ్చబండ’ కార్యక్రమం మూడో రోజు బుధవారం జిల్లాలో గట్టి పోలీస్ బందోబస్తు నడుమ జరిగింది. స్థానిక సమస్యలపై ప్రజలు అధికారు లను నిలదీస్తూ ఆందోళనలు చేయడంతో పోలీసులను మోహరింప జేశారు. తెనాలి నియోజకవర్గంలో రెండుచోట్ల, మున్నంగి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమానికి హాజరవగా, పొన్నూరులో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, వినుకొండ నియోజకవర్గం నూజెండ్లలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యాన రచ్చబండ నిర్వహించారు.
ఆయా చోట్ల ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తే అవకాశం వుందనే ముందస్తు సమాచారం మేరకు పోలీసులను భారీగా మోహరింపజేశారు. నేతలు, అధికారుల వద్దకు ప్రజలు రావడానికి కూడా వీల్లేని విధంగా పోలీసులు గట్టిబందోబస్తు పెట్టారు. అయినప్పటికీ, నేతలు ప్రసంగిస్తున్నప్పుడు ప్రజలు స్థానిక సమస్యలపై నినాదాలు చేయడంతో అధికారులు బేజారెత్తారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు, వెళాంగిణి నగర్ ప్రాంతాల్లో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ హాజరైన రచ్చబండ కార్యక్రమాల్ని కూడా మమ అనిపించారు.
రైతుల్ని పట్టించుకోని అధికారమెందుకు
గృహ నిర్మాణం, రేషన్‌కార్డులు, పింఛన్లు తదితర అంశాల ప్రాధాన్యతపైనే సాగిన రచ్చబండ కార్యక్రమంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంటనష్టం జరిగినా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడాన్ని పలు చోట్ల రైతులు ఎండగట్టారు. నూజెండ్ల మండలంలో 25 గ్రామాలకు కలిపి ఒకేచోట రచ్చబండ నిర్వహించడంతో ఆయా గ్రామాల నుంచి భారీస్థాయిలో జనం హాజరైనా ప్రజా సమస్యల ప్రస్థావనే రాలేదు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని తాయిలాల ‘వల’ విసురుతుందని విమర్శించారు.
పెండింగ్‌లో ఉన్న గృహనిర్మాణ బిల్లులపై ప్రజలు సంబంధిత శాఖ డీఈని నిలదీశారు. వివిధ పథకాల కింద దరఖాస్తులు పెట్టుకొనేందుకు ప్రజలు పోటీపడటంతో దళారులు ముందుగానే తీయించి తెచ్చుకున్న దరఖాస్తుల జిరాక్స్ కాపీలను ఒక్కొక్కటీ రూ.5, రూ.10కు అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు. ఇక్కడే సీపీఐ నేతలు రచ్చబండకు వ్యతిరేకంగా నినాదా లిచ్చారు. ప్రతీ గ్రామానికి రచ్చబండ నిర్వహించడం మంచిదని ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ప్రజలు ఖండించాలని ఆపార్టీ నేతలు బహిరంగంగా పిలుపునిచ్చారు.అధికారులపై మండిపాటు.. రచ్చబండకు సంబంధించి ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని, లబ్ధిదారులకు సరైన సమాచారం అందజేయలేదని అధికారులపై పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆయా ప్రాంతాల్లో మండిపడ్డారు. అర్హులైన లబ్ధిదారుల పేర్లు పింఛన్‌ల జాబితాలో కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement