‘కాంగ్రెస్ నాశనానికి రఘువీరానే కారణం’
అనంతపురం అర్బన్ : నవ్యంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం కావడానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డే కారణమని ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవమ్మ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాశనం కావడానికి గల కారణాలు, పీసీసీ చీఫ్ పనితీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు ఈ నెల 20న ఢిల్లీలో నివేదిక సమర్పించినట్లు చెప్పారు.
రఘువీరారెడ్డి నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నాడని ఆమె విమర్శించారు. జిల్లాలో ఓవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతతో, మరోవైపు బీజేపీ నాయకులతో, వైఎస్సార్‌సీపీ నాయకులతో, ఇటు కాంగ్రెస్ నాయకులతో తనకున్న పరిచయాలను వ్యాపార లావాదేవీలుగా మార్చి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నాడని రఘువీరాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పరిటాల సునీత ఆదేశాల మేరకు కాంగ్రెస్ అభ్యర్థులకు కొన్ని చోట్ల శాసనసభ, పార్లమెంటు సీట్లు కేటాయించడం గమనిస్తే ఆయన రాజకీయ నాటకం ఏంటో స్పష్టంగా అర్థమవుతుందన్నారు.
ఒకప్పుడు జగన్‌ను కాబోయే ముఖ్యమంత్రిని చేస్తామని నమ్మబలికిన రఘువీరా ఇప్పుడు టీడీపీ వారితో చేయి కలిపి జగన్‌పై కేసులు బలపరిచేందుకు కుట్రపన్నుతున్నాడని విమర్శించారు. అలాగే జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం తన నియంతృత్వ ధోరణి అవలంభిస్తూ మహిళా కాంగ్రెస్‌ను చిన్న చూపు చూస్తునారన్నారు. ఈ విషయాలపై సమగ్రంగా సోనియా గాంధీకి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. సోనియా పిలుపు మేరకు రాష్ట్రంలో మహిళ కాంగ్రెస్ కమిటీ పనిచేసి పార్టీని పటిష్టం చేస్తామని ఆమె తెలిపారు.