
మోదీకి మోకరిల్లి గట్టెక్కే యత్నం
చంద్రబాబుపై పీసీసీ ఆరోపణాస్త్రాలు
ఏడాది పాలనంతా అవినీతిమయమంటూ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్లు పట్టుకుని ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యత్నిస్తున్నారని పీసీసీ ఆరోపించింది. ప్రధాని చొరవ చూపితే ఈ కేసునుంచి బాబుకు తాత్కాలికంగా ఉపశమనం లభించినా మున్ముందు తప్పించుకోజాలరని హెచ్చరించింది. టీడీపీ ఏడాది అవినీతి పాలనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబనే విషయం స్పష్టమైందని, అయితే దోషులకు శిక్ష పడాలనే నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ఏపీ, తెలంగాణ సీఎంలు సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఏడాదిలోనే చంద్రబాబు రూ. 4 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు.
అది బాబు గొంతే : రామచంద్రయ్య
శాసనమండలిలో విపక్షనేత రామచంద్రయ్య మాట్లాడుతూ టెలిఫోన్ సంభాషణల్లో ఉన్నది బాబు గొంతేనన్నారు. మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి శని, ఆదివారాల్లో సన్మానాలు, సభలు, పత్రికా సమావేశాలు నిర్వహించే బీజేపీ కేంద్ర నాయకత్వం రేవంత్‌రెడ్డి ఉదంతం తర్వాత రాష్ట్రానికి, హైదరాబాద్‌కు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పల్లంరాజులు మాట్లాడుతూ ఏపీలో కేసీఆర్‌పై నమోదైన కేసులపై సిట్ ఎందుకు వేస్తున్నారో చెప్పాలన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేవీపీ రామచంద్రరావు, కిల్లి కృపారాణి, కాసు వెంకట క్రిష్ణారెడ్డి, శైలజానాథ్, కొండ్రు మురళి, తులసిరెడ్డి, దేవినేని రాజశేఖర్, గంగా భవానితో పాటు వివిధ జిల్లాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.