
మొత్తానికి అనుకున్నది సాధించావ్!
అనంతపురం : కొంతకాలంగా ఎడమొహం, పెడ మొహంగా ఉన్న జిల్లా మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్లు ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. సొంత పార్టీలోని తమ ప్రత్యర్థి జేసీ దివాకర్ రెడ్డిపై పైచేయి సాధించినందుకు ఒకరినొకరు అభినందించుకున్నారు. మాజీమంత్రి జేసీ ప్రతిపాదన మేరకు మూడో విడత రచ్చబండలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించాలని సీఎం తొలుత భావించారు. నవంబర్ 24న సీఎం తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తారని, ఆ సమయానికి చాగల్లు రిజర్వాయర్ను నీటితో నింపుతామంటూ అక్టోబర్ 30న జేసీ దివాకర్ రెడ్డి జీడిపల్లి రిజర్వాయర్, ఎంపీఆర్ డ్యామ్ వద్ద హడావుడి చేశారు. సీఎం చేతుల మీదుగా చాగల్లు రిజర్వాయర్ను జాతికి అంకితం చేస్తామంటూ ప్రకటించారు.
అయితే దీన్ని పసిగట్టిన మంత్రులు శైలజానాథ్, రఘువీరా సీఎం వద్దకు వెళ్లి తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తే, తాము బహిష్కరిస్తామని తెగేసి చెప్పారు. తాడిపత్రి మినహా ఎక్కడైనా పర్యటించాలంటూ రఘువీరా షరతు విధించారు. మంత్రి శైలజానాథ్ మాత్రం తన నియోజకవర్గంలోని నార్పలలో పర్యటించాలని పట్టుబట్టారు. చివరకు కిరణ్ శైలజానాథ్ ప్రతిపాదన వైపే మొగ్గు చూపి.... ఆదివారం నార్పలలో పర్యటించారు.
ఈ సందర్భంగా నార్పలకు వచ్చిన రఘువీరా హెలీప్యాడ్ వద్ద మంత్రి శైలజానాథ్ను ఆలింగనం చేసుకున్నారు. 'మొత్తానికి అనుకున్నది సాధించావ్, సీఎంను నీ ఇలాకాకు రప్పించుకున్నావ్. కంగ్రాట్స్' అంటూ అభినందించారు. ఇందుకు 'అంతా మీ సహకారం' అంటూ శైలజానాథ్ ప్రతిస్పందించారు. ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోవటం గమనార్హం.