
కలం కబుర్లు...
సీఎం నంబర్ ఇస్తే పోలే!
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రూపంలో తలనొప్పి వచ్చి పడింది. ప్రభుత్వం రైతు రుణ విముక్తి పథకం గురించి గొప్పగా చెప్పుకుంటోందని, ఆ పథకం డొల్ల మాత్రమేనని విమర్శించిన రఘువీరారెడ్డి ఈ పథకంపై సందేహాలుంటే నేరుగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫోన్ చేయాలని నేరుగా మంత్రి సెల్‌ఫోన్ నంబరు వెల్లడించారు. దీంతో మంత్రికి క్షణం తీరిక లేకుండా వరుసగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్లు శరపరంపరగా వస్తూనే ఉన్నాయి. రుణ మాఫీ సంగతేంటంటూ ప్రతి ఒక్కరూ ఫోన్ చేయడమే కాకుండా కనీసం పావుగంట సేపు మాట్లాడుతున్నారట.
వారు మాట్లాడే సమయంలో మధ్యలోనే కట్ చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయన్న భయంతో కొన్ని ఫోన్లు మాట్లాడారట. ఇక లాభం లేదనుకున్న మంత్రివర్యులు ఫోన్లకు సమాధానం చెప్పేందుకు ప్రత్యేకంగా పీఏను కేటాయించారు. అయితే, సందేహాలు తీర్చుకునేందుకు ఫోన్ చేసిన రైతులు పీఏ చెప్పిందంతా విన్న తరువాత మీరెవరని ప్రశ్నించి.. పీఏ అన్న సమాధానం రాగానే రైతులు మంత్రిగారేమయ్యారంటూ నిట్టూరుస్తున్నారట. ఈ విషయం ఆయనే మీడియాకు చెప్పుకోగా, అది విన్న టీడీపీ సహచరుడొకరు విరుగుడు మంత్రం బోధించారు.. మంత్రిగారికెందుకు తంటాలు..! అదేదో ముఖ్యమంత్రి ఫోన్ నంబర్ ఇస్తే పోలే..!
మౌనం వెనుక బావ..!
ఏపీ శాసనసభ లాబీల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట కలపకుండా మౌనంగా ఉంటున్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో తనదైన శైలిలో మాట్లాడుతున్న బాలయ్య.. మీడియా ప్రతినిధుల మాట మాత్రం వినిపించుకోనట్లు ఉంటున్నారు. దీని వెనుక ఆయన బావ, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ స్వతహాగా మనసులో ఏమీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంటారు. విలేకరులు పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై ప్రశ్నిస్తే బాలకృష్ణ సమాధానాలతో పార్టీకి, ప్రభుత్వానికి ఏ తంటా వస్తుందోనన్న ఆందోళనతో.. శాసనసభ సమావేశాల్లో నోరు మెదపొద్దని సీఎం స్పష్టంగా చెప్పటంతో మాట్లాడించేందుకు ఏ విలేకరి ఎంత ప్రయత్నించినా నోరు మెదపడం లేదని ఎమ్మెల్యేలు చెవులు కొరుక్కుంటున్నారు.
‘తెల్గీ’దేశం ఆఫీసుకు వెడదామా..?
స్టాంపుల కుంభకోణం కేసులో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన సి.కృష్ణాయాదవ్ ఇప్పుడు హైదరాబాద్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యారు. మధ్యలో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కృష్ణాయాదవ్‌ను ఇప్పుడు హైదరాబాద్ పార్టీ అధ్యక్ష పదవి వరించింది. కానీ, ఆయన నాయకత్వం నచ్చనివారు నగర టీడీపీ కార్యాలయా న్ని ‘తెల్గీ ఆఫీసు’ అంటున్నారు. స్టాంపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీతో పాటు కృష్ణాయాదవ్ చాలాకాలం పూణే జైలులో ఉన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని తెలుగు తమ్ముళ్లు ఆ పార్టీ ఆఫీసును కాస్త తెల్గీ ఆఫీసు అంటూ పేరును కుదించారు. ఇది తెలియని తమ్ముళ్లు తెలుగును కుదించి ‘తెల్గీ’ అని పిలుచుకుంటున్నారా.. ? అంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు.
హమ్మయ్య.. మన సీఎం సారేనట!
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు హెలికాప్లర్లు పెద్దశబ్దంతో ఆకాశంలో ఎగురుతూ వస్తుంటే.. ఆ పల్లె వాసులు భయపడ్డారు. ఒక్క హెలికాప్టర్ కిందకు దిగుతుంటేనే పెద్ద శబ్దం వస్తుంది, అలాంటిది నాలుగు హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఆకాశంలో దూసుకువస్తుంటే భయపడరా....మరి? ఇటీవల రాచకొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, సహచర మంత్రులు, ఉన్నతాధికారులు నాలుగు హెలికాప్టర్లలో అక్కడికి వెళ్లారు.
మామూలుగా వాహనాల శబ్దం కూడా పెద్దగా ఉండని రాచకొండ పల్లెల్లో ఈ నాలుగు హెలికాప్టర్ల రాకను చూసి పల్లీయులు చాలా కంగారు పడ్డారట. మళ్లీ నక్సలైట్లు ఏమైనా వచ్చి ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసుకున్నారా ...? అదితెలిసి పోలీసులు వస్తున్నారేమో అని పల్లెవాసులు ఉలిక్కిపడ్డారట. వచ్చింది ముఖ్యమంత్రి అని తెలిసి‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారట. ఈ విషయం ఓ ఉన్నతాధికారే స్వయంగా సహచర అధికారులకు చె బుతూ కడుపుబ్బ నవ్వించారు.