
రహస్య ఒప్పందాలతో దోపిడీ:రఘువీరా
అమరావతి: రాజధాని నిర్మాణం పేరిట సింగపూర్‌తో రహస్య ఒప్పందాలు చేసుకొని సీఎం చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి రాజధాని నిర్మాణానికి చేసుకున్న ఏకపక్ష, రహస్య స్విస్ చాలెంజ్ ఒప్పందాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
మూడేళ్ల పాలన పాపాలపై జూన్ 8వ తేదీన పీసీసీ ఆధ్వర్యంలో ప్రజా చార్జిషీట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి హోదా సాధించి తీరుతామని, అందుకు గాను వచ్చే నెల మొదటి వారం భీమవరంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు ప్రత్యేక హోదాను బలపర్చిన 14 జాతీయ పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగమైన ప్రత్యేక హోదా అమలు చేయకుండా నియోజకవర్గాల పునర్విభజనపై దృష్టి సారించడం సరికాదన్నారు.