
ఎలా బతికించుకోవాలి?: రాహుల్ గాంధీ
సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితిపై రాహుల్ ఆరా
చిరంజీవి, రఘువీరా, డొక్కాలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో తీవ్రంగా దెబ్బతిన్న పార్టీని తిరిగి బతికించుకోవడమెలా అన్న అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర తర్జనభర్జనలు సాగిస్తోంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సీమాంధ్రకు చెందిన సీనియర్ నేతలతో గత కొద్దిరోజులుగా ముఖాముఖి నిర్వహిస్తూ ఇదే అంశంపై వారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మాజీ మంత్రులు ఎన్.రఘువీరారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లతో రాహుల్ శనివారం ఢిల్లీలో ముఖాముఖి చర్చించారు. ‘‘పార్టీ పరిస్థితి పూర్తి అధ్వానంగా ఉంది. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించాం. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో పార్టీకి ఒకదానిపై ఒకటిగా దెబ్బలు తగులుతూ వచ్చాయి. వైఎస్ జగన్ పార్టీని వీడి వెళ్లిపోయారు.
తెలంగాణ అంశం తెరపైకి వచ్చి పార్టీకి ఇరకాటస్థితిని తెచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయినా కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పలేదు’’ అని రాహుల్ తనతో భేటీ అయిన వారితో వ్యాఖ్యానించారు. పార్టీని ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? కనీసం అక్కడ పోటీకి వీలుగా పార్టీని తిరిగి బతికించుకొనేందుకు ఎలాంటి చర్యలుచేపట్టాలో సూచనలు ఇవ్వాలని నేతలను కోరారు. సీమాంధ్ర ప్రాంతంలో సోనియా, రాహుల్ పర్యటించాలని, కేంద్రం ద్వారా ఆ ప్రాంతానికి చేసే మేలు గురించి చెబితే పార్టీ శ్రేణుల్లో కొంత స్థైర్యం వస్తుందని సీనియర్ నేతలు వివరించారు. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికతో సహా పలు రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు, మేనిఫెస్టో రూపకల్పన వంటి అంశాలపై తలమునకలై ఉన్నందున ఇవన్నీ పూర్తయ్యాక సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ పర్యటిస్తామని రాహుల్ సీమాంధ్ర నేతలకు తెలిపారు.