నేడు రైల్వేకోడూరుకు సీఎం చంద్రబాబు
సాక్షి, కడప : రాష్ర్ట ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శనివారం జిల్లా పర్యటనకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిననంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం చంద్రబాబు వైఎస్సార్ జిల్లాకు రావడం ఇదే ప్రథమం. అందుకు సంబంధించి బాబు తన పర్యటనలో అధికారికంగా పలు కార్యక్రమాలకు బాబు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
రైల్వేకోడూరు పరిధిలోని ఓబనపల్లెలో శుక్రవారం సాయంత్రం ఏర్పాట్లను మంత్రి రావెల కిషోర్‌బాబుతోపాటు జిల్లా కలెక్టర్ కేవీ రమణ, ఇతర అధికారులు పరిశీలించారు. రైల్వేకోడూరు పరిధిలోని ఓబనపల్లె జన్మభూమి-మా ఊరు గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. శనివారం ముందుగా ఉదయం 12 గంటల ప్రాంతంలో ఓబనపల్లెలో మొక్కలు నాటే కార్యక్రమంతోపాటు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
అనంతరం బడిపిలుస్తోంది కార్యక్రమంలో కూడా బాబు పాల్గొననున్నారు. అలాగే పశు వైద్య శిబిరం, హెల్త్ క్యాంపు, ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను పరిశీలించనున్నారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు సంబంధించిన స్త్రీ శక్తి భవనంతోపాటు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులతో బాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.
బాబు పర్యటనకు భారీ బందోబస్తు
సీఎం శనివారం రైల్వేకోడూరుకు వస్తున్న సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాజంపేట డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నియమించారు. నలుగురు అదనపు ఎస్పీలు, పది మంది డీఎస్పీలు, 22 మంది సీఐలు, 62 మంది ఎస్‌ఐలు, 99 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 508 మంది పోలీసు కానిస్టేబుళ్లు, 55 మంది మహిళా కానిస్టేబుళ్లు, 64 మంది హోం గార్డులతోపాటు తొమ్మిది సెక్షన్ల స్పెషల్ పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు.
సీఎం పర్యటన సాగేదిలా....
సీఎం చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హైదరాబాదు నుంచి బయలుదేరి 11.30 గంటలకు రేణిగుంటకు చేరుకుని 12.00 గంటలకు కోడూరు సమీపంలోని ఓబనపల్లెకు చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యకక్రమాల్లో పాల్గొంటారు. అలాగే స్త్రీ శక్తి భవనానికి కూడా ప్రారంభించనున్నారు. 4.40గంటలకు హెలికాఫ్టర్‌లో రేణిగుంటకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదు వెళతారు.