నేటినుంచి... రైల్వే ‘చార్జ్’
పెరిగిన రైల్వే చార్జీలు
{పయాణికులపై రూ.230 కోట్ల భారం
అదనపు చార్జీలు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్
సరకు రవాణా పైనా భారం
రానున్న రోజుల్లో నిత్యావసరాల ధరలపై ప్రభావం
ప్రయాణికులపై చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇప్పటికే చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి నుంచి పెంచిన చార్జీలు అమలులోకి రానున్నాయి. దీంతో విజయవాడ రైల్వే డివిజన్ ప్రయాణికులపై సాలీనా రూ.100 కోట్ల భారం పడనుంది.
విజయవాడ : రైల్వే చార్జీలు అమలులోకి వచ్చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి చార్జీలు అమలు చేసేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. రైల్వే చార్జీలను 14.2 శాతం పెంచుతూ ఇటీవల నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. చార్జీల పెంపుపై ప్రయాణికులు పెదవి విరుస్తుండగా, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి.
డివిజన్ పరిధిలో రూ.100 కోట్ల ఆదాయం...
2013-14 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ డివిజన్‌కు రూ.3,280 కోట్ల ఆదాయం వచ్చింది. డివిజన్‌లో 102 మిలియన్ల మంది ప్రయాణికులు రైల్వేశాఖ సేవలను వినియోగించుకున్నారు. వీరి ద్వారా రైల్వే శాఖకు రూ.661 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం టిక్కెట్ రేట్లు పెంచడం ద్వారా ఆదాయం మరో రూ.100 కోట్లు పెరగనుంది. ప్రయాణికుల నుంచి సుమారుగా రూ.760 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనాలు వేస్తున్నారు. సరకు రవాణాపై రూ.6.5 శాతం మేర చార్జీలు పెంచారు. విజయవాడ డివిజన్ నుంచి ఎరువులు, బొగ్గు, ఆయిల్స్ రవాణా ఎక్కువగా జరుగుతుంది. డివిజన్ పరిధిలో సరకు రవాణా ద్వారా మరో రూ.130 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ లెక్కన ఒక్క విజయవాడ డివిజన్ పైనే సుమారు రూ.230 కోట్ల భారం పడనుంది. సరకు రవాణా చార్జీలు పెంచడం వల్ల రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
అదనపు చార్జీలు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు...
ముందుగా తీసుకున్న టికెట్లకు అదనపు రేటు చెల్లించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఈ సొమ్మును రైలులో టిక్కెట్ కలెక్టర్‌కు చెల్లించవచ్చు. ప్రయాణికుల సౌకర్యాం కోసం పెరిగిన చార్జీలను ముందుగానే చెల్లించేందుకు అధికారులు రైల్వే స్టేషన్‌లో కౌంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ ఈస్ట్, వెస్ట్, మెయిన్ బుకింగ్ కౌంటర్‌ల వద్ద ఈ అదనపు చార్జీలను వసూలుచేసే కౌంటర్లు ఏర్పాటయ్యాయి.