సాక్షి, నిజామాబాద్: వడగళ్లవాన.. అధిక వర్షాలు.. తరచూ ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతున్న జిల్లా రైతాంగాన్ని ఆదుకునే విషయంలో రాష్ట్ర సర్కారు చొరువ చూప డం లేదు. 2012 ఏప్రిల్‌లో కురిసిన వడగళ్లవానతో పంట నష్టపోయిన రైతాంగానికే ఇంత వరకు నయా పైసా పరిహారం చెల్లించలేదంటే జిల్లా రైతాంగంపై సర్కారుకున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. రెండేళ్లలో ఆరుసార్లు ప్రకృతి తన ప్రతాపాన్ని చూపడం తో రైతన్నలు కోలుకోలేని విధంగా నష్టపోయారు. సర్వం కోల్పోయిన రైతాంగానికి చెలించాల్సిన సుమారు *20 కోట్ల పంట నష్ట పరిహారం రెండేళ్లు గడుస్తున్నా విడుదల చేయడం లేదు. అధికారులు పంపిన పరిహా రం ప్రతిపాదనలు ఏళ్ల తరబడి సర్కారు వద్ద మూలుగుతున్నాయి.
తరచూ బీభత్సం..
2012లో ఏప్రిల్‌లో కురిసిన వడగళ్ల వాన రబీ పంటలను నిండా ముంచింది. 1,349 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. సర్వే నిర్వహించిన జిల్లా యంత్రాంగం సు మారు 2,600 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తేల్చింది. రూ.78 లక్షల పరిహా రానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపా రు. ఇప్పటి వరకు పైసా విదల్చలేదు.
గత ఏడాది ఖరీఫ్ పంటలను కూడా అధిక వర్షాలు ముంచెత్తాయి. 2012 సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలు చేతికందే పంటలను తుడిచిపెట్టేశాయి. జిల్లావ్యాప్తంగా 1,268 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. వీరికి చెల్లించాల్సిన పంటనష్ట పరిహారం రూ.30.24 లక్షలు కూడా రెండేళ్లుగా సర్కారు విడుదల చేయడం లేదు. అక్టోబర్‌లో కురిసిన అధిక వర్షాలతో మరో 2,526 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు చెల్లించాల్సిన మరో రూ.61.33 లక్షలను ఇంకా విడుదల లేదు.
ఈ ఏడాది (2013) జనవరి, ఫిబ్రవరిల్లో కురిసిన వడగళ్ల వాన ప్రారంభదశలోని రబీ పంటలను దెబ్బతీసింది. జనవరిలో కురిసిన వడగళ్ల వానతో 225 మంది రైతులు నష్టపో గా,ఫిబ్రవరిలో కురిసిన వడగళ్లవానతో 646 మంది రైతుల పంటలు దెబ్బదిన్నట్లు గుర్తిం చారు.వీరికీ పరిహారం విడుదల కాలేదు.
ఇటీవల జూలైలో పడిన భారీ వర్షానికి 1380 హెక్టార్లలో సోయా, శనగ తదితర పం టలు దెబ్బతిన్నాయి. కోట్ల రూపాయల్లో పం టలకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం కేవలం ఇన్‌పుట్ సబ్సిడీ (విత్తన సబ్సిడీ) మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించింది. కానీ నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు.
రెండేళ్లుగా నిధులు రాలేదు:-నర్సింహ, జేడీఏ
ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం తో పరిహారం పంపిణీలో జాప్యం జరుగుతోంది. 2012 నుంచి నిధులు రాలేదు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలో కురిసిన వర్షానికి నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇంకా నిధులు విడుదల కాలేదు.