(లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :రాజరాజ నరేంద్రుడు ఏలిన రాజమహేంద్రి అంటేనే కళలకు, కళాకారులకు పెట్టింది పేరు. ఎందరో మహానుభావులను కళారంగానికి పరిచయం చేసి కళామతల్లికి నీరాజనాలు పలికింది ఈ నగరం. ఎక్కడెక్కడి బంధువులో పెద్ద పండుగకు పుట్టింటికి వచ్చినట్టుగా నంది నాటకోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు తరలివచ్చారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారి రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో 16 రోజుల నంది నాటకోత్సవాలకు శనివారం శ్రీకారం చుట్టారు.
ఇందుకోసమే రాజమండ్రి ఆనం కళాకేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విభజనకు ముందు హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే నాటకోత్సవాల విభజన తరువాత రాజమండ్రికి మారాయి. ఆంధ్రాలో సినీ పరిశ్రమకు రాజమండ్రి కేంద్రం కావాలని నాటకోత్సవాలకు హాజరైన పలువురు కళాకారుల అభిలాష. అందుకు ఈ నంది నాటకోత్సవాలే నాంది కావాలని ఆకాంక్షిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే నాటకోత్సవాలను తలదన్నే రీతిలో ఆతిథ్యం, ఆదరణ ఉండేలా ఈ 16 రోజులు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పుష్కర పనులను పరిశీలించిన గవర్నర్
ఈ వారం ప్రారంభంలో రాష్ట్ర గవర్నర్ ఎం.ఎల్.నరసింహన్ విభజన తరువాత జిల్లాకు తొలిసారి వచ్చారు. రాజమండ్రిలో పుష్కర పనులను పరిశీలించిన గవర్నర్ అధికారులను పరుగులు పెట్టించారు. ప్రతీ పనిపై ఆరా తీశారు. భద్రతకు సంబంధించి సూచనలు చేశారు. కోరుకొండ లక్ష్మీనరిసింహస్వామిని దర్శించుకున్నారు. తన సతీమణి ముచ్చటపడ్డ జాంధానీ చీరలను ఉప్పాడ వెళ్లి మరీ కొనిపెట్టారు. పుష్కర పనుల్లో వేగం పెంచాలన్న గవర్నర్ మాటను ఎంతవరకు నిలబెడతారో వేచి చూడాల్సిందే. పనిలో పనిగా జేఎన్‌టీయూకేలో వివాదాస్పదంగా మారి, తరచు ఫిర్యాదులు వస్తోన్న గ్లోబరీనా ఒప్పందంపై వీసీ వీఎస్‌ఎస్ కుమార్‌ను సుమారు గంటపాటు ఆరా తీసి వెళ్లారు. చాన్సలర్ హోదాలో ఆ ఒప్పందంపై సమగ్ర నివేదికను వెంట తీసుకువెళ్లి ఉంటారని భావిస్తోన్న వర్సిటీ వర్గాలు ఆయన తీసుకోబోయే చర్యల కోసం ఉత్కంఠగా నిరీక్షిస్తున్నారు.
రెండోసారి పర్యటించిన సీఎం చంద్రబాబు
వరుసగా రెండో వారం సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వచ్చారు. గత హామీలనే తిరిగి వేట్లపాలెం సభలో వినిపించడం జనానికి విసుగెత్తించేలా చేసింది. ప్రకటనలకే పరిమితమైన ప్రాజెక్టులను మరోసారి నొక్కి చెప్పిన బాబు కొంతలో కొంత ఊరటనిచ్చే అంశాలు కొన్నింటిని ప్రస్తావించారు. జిల్లాలో అన్ని పంచాయతీల్లో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి రూ.200 కోట్లు, ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.137కోట్లు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌కు రూ.11 కోట్లు మంజూరు చేశామని చెప్పి వెళ్లారు. అలాగే కొత్తగా కాకినాడలో మరోపోర్టు, పెట్రో వర్సిటీ కాకినాడలో ఏర్పాటు చేసి, ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభిస్తామని చెప్పడం కొంతలో కొంత జిల్లావాసులకు ఉపశమనం కలిగించాయి.
ఇన్‌చార్జి మంత్రిగా దేవినేని
ఈ వారం అధికారికంగా మరొక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న తరుణంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిని ప్రకటించారు. తొలుత మంత్రి శిద్ధా రాఘవయ్య పేరును తెరమీదకు తెచ్చిన సర్కారు చివరి నిమిషంలో ఆయనను కాదని ఆ బాధ్యతలు మంత్రి దేవినేనికి అప్పగించింది. వివాదాస్పద పట్టిసీమ, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు కలిగి ఉండడంతో జిల్లాకు జలవనరుల శాఖామాత్యులనే ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించారు. ఈ నియామకంతో జిల్లాకు ఏమేరకు ప్రయోజనం చేకూరుతుందనేది చూడాల్సిందే.
ఏసీబీకి చిక్కిన ఆర్డీ రాజేంద్రప్రసాద్
మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ రాజేంద్రప్రసాద్ లంచం తీసుకుంటూ పట్టుబడడం జిల్లా అధికార యంత్రాగాన్ని ఉలిక్కిపడేట్టు చేసింది. పెడన మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ నుంచి రూ.50డ వేల లంచం తీసుకుంటూ పట్టుబడడంతో రాజమండ్రిలోని ఆయన ఇంట్లో సోదాలు చేసి పలు రికార్డులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. మున్సిపల్ పరిపాలనాపరంగా అవినీతికి తావులేకుండా సమర్థంగా పనిచేయాలంటూ ప్రతీ సమీక్ష సమావేశాల్లో అధికారులందరికీ క్లాసులు తీసుకునే ఆర్డీ రాజేంద్రప్రసాద్ స్వయంగా కింది స్థాయి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. క్రమంగా పెరుగుతున్న ఎండలతో వేగిపోతున్న జిల్లాకు వారం చివరిలో ఉపశమనం కలిగింది. శుక్ర, శనివారాలు జిల్లాలో పలు చోట్ల మంచి వర్షాలు కురిశాయి.
రాజమహేంద్రిలో‘నంది’ సందడి
Published Sun, May 17 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement
Advertisement