జక్కంపూడి రాజా
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం : రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు విజయవాడలోని ఎ–1 కన్వెన్సన్ సెంటర్లలో పార్టీ నాయకులు, జక్కంపూడి అభిమానులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కాపు కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే దానిపై పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ యువకుడు, దివంగత జక్కంపూడి తనయుడు కావడం, పార్టీలో యువజన విభాగంలో క్రియాశీలకంగా ఉండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎమ్మెల్యే రాజా వైపే మొగ్గుచూపించారు.
పార్టీ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు కూడా రాజాకు చైర్మన్ పదవి కట్టబెట్టే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో చైర్మన్ పదవి ఖాయమైంది. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి అయ్యాక తొలి బడ్జెట్‌లోనే రూ.2000 కోట్లు కాపు కార్పొరేషన్‌కు కేటాయించి కాపుల అభ్యున్నతికి తొలి అడుగు వేశారు. ఈ క్రమంలోనే ఇటీవలనే కాపు కార్పొరేషన్‌ను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించే దిశగా ముఖ్యమంత్రి జగన్ ఐఏఎస్ అధికారి హరీంద్రప్రసాద్‌ను ఎండీగా నియమించారు. ఇందుకు భిన్నంగా గత చంద్రబాబు పాలనలో కాపు కార్పొరేషన్‌లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా కోత పెట్టి బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు చెప్పి మాట తప్పారు. ఈ క్రమంలోనే యువకుడైన రాజా కార్పొరేషన్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తారనే నమ్మకంతో కేటాయించారు. రాజా ప్రమాణస్వీకారోత్సవానికి రాష్ట్రంతోపాటు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు శనివారమే విజయవాడ తరలివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment