
డ్యాన్సర్లతో ఏఎస్‌ఐ చిందులు..
► వెయ్.. చిందెయ్..!
► జాతరలో స్టెప్పులేసిన ఏఎస్‌ఐ
► మహిళతో అసభ్యకర ప్రవర్తన
► ఏఎస్‌ఐ ప్రవర్తనపై వెల్లువెత్తిన విమర్శలు
రాజంపేట : అతను రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నందలూరు మండలం కుంపిణీపురంలో శుక్రవారం రాత్రి జరిగిన జాతరలో డ్యాన్సర్లతో కలసి రెచ్చిపోయి చిందులేశాడు. ఓ మహిళను ముద్దాడాడు. ఈ దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
కుంపిణీపురంలో జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి సంగీతవిభావరి నిర్వహించారు. ఈ విభావరిలో ఈ ఏఎస్‌ఐ ఓ మహిళను బహిరంగంగానే ముద్దుపెట్టుకున్నాడు. అంతేగాకుండా ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. పువిత్ర పుణ్యక్షేత్రమైన కుంపిణీపురంలో అసభ్యకరమైన నృత్యాలు జరుగుతాయని డీఎస్పీ మొదలుకుని జిల్లా ఎస్పీ వరకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.
జిల్లా ఎస్పీ కూడా ఈ విషయంపై సీరియస్ అయి అశ్లీల నృత్యాలకు అనుమతి ఇవ్వరాదని పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు నుంచి ఓ నృత్యబృందంచే కార్యక్రమం నిర్వహించేందుకు రూ.1లక్షకు ఒప్పందం కుదర్చుకొని కుంపిణీపురానికి తీసుకువచ్చినట్లుగా తెలిసింది. ఈ నృత్య బృందంలోని మహిళతో కలిసి ఏఎస్‌ఐ చేసిన నృత్యం.. ఆయన ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.